ఇండిగో బంపర్ ఆఫర్: తక్కువ ధరకే 'ఇండిగో లైట్' విమాన టికెట్లు
విమాన ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం హ్యాండ్ బ్యాగేజీతో ప్రయాణించే వారి కోసం తక్కువ ధరలకే 'ఇండిగో లైట్' పేరిట సరికొత్త టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. జూలై 1 నుంచి ఈ టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
విమాన ప్రయాణికులకు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో తీపి కబురు అందించింది. లగేజీ లేకుండా కేవలం హ్యాండ్ బ్యాగుతో (కేబిన్ బ్యాగేజీ) ప్రయాణించే వారి కోసం తక్కువ ధరకే టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం 'ఇండిగో లైట్' (IndiGo Lite) పేరిట సరికొత్త కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. విమాన ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చడంతో పాటు, సేవలను విడివిడిగా అందించి టికెట్ ధరలను తగ్గించే వ్యూహంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
జూలై 1 నుంచి ఈ టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూలై 15 నుంచి ఈ టికెట్ల ద్వారా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ రూట్లలోనూ ఈ 'ఇండిగో లైట్' టికెట్లు అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఇండిగో అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు.
రూల్స్ ఏంటి? ఆఫర్లు ఏమున్నాయి?
ఈ సరికొత్త ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు బేస్ ప్రైస్ (టికెట్ అసలు ధర) చాలా తక్కువగా ఉంటుంది. ఎలాంటి అదనపు రుసుము లేకుండానే ఆటో-అసైన్డ్ సీటు కేటాయిస్తారు. ప్రయాణికులు తమతో పాటు కేవలం 7 కేజీల వరకు కేబిన్ బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.
"తక్కువ లగేజీతో ప్రయాణిస్తూ, తాము కోరుకున్న సేవలకే డబ్బులు చెల్లించాలనుకునే వారి కోసం 'ఇండిగో లైట్'ను రూపొందించాం. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కస్టమర్లకు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం, చౌకగా మార్చాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం" అని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఆలోక్ సింగ్ తెలిపారు.
పెరుగుతున్న పోటీ.. రంగంలోకి ఎయిర్ ఇండియా
ఎయిర్‌లైన్స్ రంగంలో పోటీ పెరగడంతో విమానయాన సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్న వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇండిగోకు గట్టి పోటీ ఇస్తున్న ఎయిర్ ఇండియా సైతం గత నెలలోనే 'బేసిక్ ఎకానమీ' పేరిట ఉచిత భోజనం లేని తక్కువ ధరల టికెట్లను ప్రవేశపెట్టింది. కేవలం ప్రయాణ ఖర్చులను మాత్రమే తగ్గించుకోవాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తన డైరెక్ట్ ఛానల్స్ ద్వారా ఇప్పటికే ఇలాంటి బ్యాగేజీ-రహిత తక్కువ ధరల విధానాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నేతృత్వంలోని ఇండిగో సైతం తన మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు 'ఇండిగో లైట్' ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


