2 కొత్త విమానయాన సంస్థలు: అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్‌లకు కేంద్రం పచ్చజెండా

భారత విమానయాన రంగంలోకి కొత్తగా రెండు సంస్థలు ప్రవేశించనున్నాయి. అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్‌లకు కేంద్రం NOC మంజూరు చేసింది. వీటి రాకతో విమాన ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు, మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానున్నాయి.

Published on: Dec 24, 2025, 16:43:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత గగనతలంపై మరిన్ని కొత్త విమానాలు రెక్కలు విప్పనున్నాయి. దేశీయ విమానయాన రంగంలో పోటీని పెంచుతూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర పౌర విమానయాన శాఖ రెండు కొత్త విమానయాన సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. అల్ హింద్ ఎయిర్ (Al Hind Air), ఫ్లై ఎక్స్‌ప్రెస్ (FlyExpress) సంస్థలకు బుధవారం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు (NOC) లభించినట్లు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

2 కొత్త విమానయాన సంస్థలు: అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్‌లకు పచ్చజెండా (X/ @RamMNK)
2 కొత్త విమానయాన సంస్థలు: అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్‌లకు పచ్చజెండా (X/ @RamMNK)

రంగంలోకి కొత్త ప్లేయర్లు

ప్రస్తుతం భారత దేశీయ విమానయాన మార్కెట్‌లో ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ సంస్థలే 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఆధిపత్యాన్ని తగ్గించి, మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది.

"గత వారం రోజుల్లో కొత్త విమానయాన సంస్థల ప్రతినిధులను కలిశాను. శంఖ్ ఎయిర్ ఇప్పటికే NOC పొందగా, ఈ వారం అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్‌లకు కూడా అనుమతులు లభించాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత ఏవియేషన్ రంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది" అని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

అల్ హింద్ ఎయిర్ ప్రణాళికలివే..

కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ ప్రమోట్ చేస్తున్న అల్ హింద్ ఎయిర్, కొచ్చి (Kochi) ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.

విమానాలు: తొలుత ఏటీఆర్ 72-600 (ATR 72-600) రకం విమానాలతో ప్రాంతీయ సర్వీసులను ప్రారంభించనుంది.

లక్ష్యం: దేశీయంగా ప్రాంతీయ కనెక్టివిటీని పటిష్టం చేసిన తర్వాత, అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించాలని ఈ సంస్థ యోచిస్తోంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం (CIAL) సహకారంతో ఇప్పటికే ఆపరేషనల్ బేస్ పనులు ముమ్మరం చేసింది.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంఖ్ ఎయిర్ (Shankh Air) కూడా 2026 నుంచి విమాన ప్రయాణాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం

ఇటీవల దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో తీవ్ర నిర్వహణ లోపాలను ఎదుర్కొంది. వేలాది విమానాలు రద్దు కావడం, ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కేవలం ఒకటి రెండు సంస్థల పైనే మొత్తం మార్కెట్ ఆధారపడితే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఉడాన్ (UDAN) వంటి పథకాల ద్వారా స్టార్ ఎయిర్, ఫ్లై91 వంటి చిన్న విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తూ, రీజినల్ కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

కొత్తగా వచ్చే ఈ సంస్థలు విమాన చార్జీల తగ్గింపుతో పాటు, చిన్న నగరాలకు కూడా విమాన ప్రయాణ సౌకర్యాన్ని మరింత చేరువ చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More