ఏపీలో పాక్ హనీట్రాప్ కలకలం: నేవీ ఉద్యోగి సహా ఇద్దరి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన ఆపరేషన్ ఫైర్‌వాల్-2026లో పాకిస్థాన్ హనీట్రాప్ ముఠా గుట్టు రట్టయింది. విశాఖ నావికాదళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేస్తున్న నేవీ ఉద్యోగి, కాంట్రాక్టు డ్రైవర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.
దేశ రక్షణ వ్యవస్థ లక్ష్యంగా పాకిస్థాన్ నిఘా సంస్థలు పన్నుతున్న కుట్రలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచి, భారతీయ రక్షణ దళాల ఉద్యోగులను ఆకర్షించి రహస్య సమాచారాన్ని సేకరిస్తున్న పాక్ ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐసీ) విభాగం విజయవంతంగా ఛేదించింది. ఈ హనీట్రాప్ ఉచ్చులో పడి దేశభద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన ఓ భారత నావికాదళ ఉద్యోగి సహా ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.

ఆపరేషన్ ఫైర్‌వాల్-2026తో రంగంలోకి
విశాఖపట్నం నావికాదళ కేంద్రం కేంద్రంగా సాగుతున్న ఈ గూఢచర్యాన్ని ఛేదించేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు అక్టోబర్ 1న 'ఆపరేషన్ ఫైర్‌వాల్-2026' పేరుతో భారీ సోదాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 12 ప్రత్యేక బృందాలు ఒకేసారి రంగంలోకి దిగాయి. వివిధ రాష్ట్రాల ఉగ్రవాద నిరోధక దళాలు (ఏటీఎస్), నేవీ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి జరిపిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 18 మంది అనుమానితుల పాత్రపై అధికారులు విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు వీరే
విశాఖ నావల్ బేస్‌లో విధులు నిర్వర్తిస్తున్న నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీ, నావికాదళంలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్‌లను సీఐసీ పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలో అరెస్టయిన సాయి వరప్రసాద్.. రక్షణ రంగానికి చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు అందించి, ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కోయంబత్తూరులో పట్టుబడిన ప్రదీప్ ముఖర్జీ.. పాక్ ఏజెంట్లకు వాట్సాప్ ఖాతా యాక్టివేషన్ కోసం ఓటీపీ (OTP) షేర్ చేయడంతో పాటు నేవీకి చెందిన రహస్య సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్ ఛానెళ్ల ద్వారా చేరవేసినట్లు తేలింది.
న్యాయస్థానం ముందు హాజరు
నిందితులపై విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 2న కేసు నమోదైంది. వారిపై అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act) తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద దేశంపై యుద్ధం ప్రకటించడం, రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తమిళనాడులో అరెస్టయిన ప్రదీప్ ముఖర్జీని ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలించారు. అనంతరం ఇద్దరు నిందితులను విజయవాడ, విశాఖపట్నంలలోని సంబంధిత న్యాయస్థానాల ముందు హాజరుపరచగా, కోర్టు అక్టోబర్ 14 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం సాయి వరప్రసాద్ విశాఖపట్నం జిల్లా జైలులో, ప్రదీప్ ముఖర్జీ విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. ఈ కేసులో మిగిలిన 13 మంది నేవీ సిబ్బందితో సహా ఇతర అనుమానితుల పాత్రపై నిఘా వర్గాల విచారణ ముమ్మరంగా సాగుతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


