...
...
Next Story

రాప్తాడు హైస్కూల్ ఘటన : నిందితుడు అరెస్ట్ - రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్! అసలేం జరిగింది..?

అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్ ఘటనలో టెన్త్ బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను ధర్మవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్కూల్ హెచ్‌ఎం రాజేశ్వరిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.

Published on: Oct 31, 2026, 15:38:03 IST
Advertisement

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకుని విచారణకు తరలించారు.

రాప్తాడు హైస్కూల్ ఘటన
రాప్తాడు హైస్కూల్ ఘటన

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం….. నిందితుడు హేమంత్ బాధితురాలైన బాలికకు బంధువవుతాడని భావిస్తున్నారు. ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన హేమంత్ తల్లిదండ్రులు చనిపోవడంతో, కొన్నాళ్లుగా అయ్యవారిపల్లెలో తన అక్క వద్ద నివాసం ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. బాలిక తన ప్రేమను తిరస్కరించడంతో తీవ్ర కక్ష పెంచుకున్న హేమంత్…… ఉన్మాదిలా మారి విద్యుత్ రంపంతో పాఠశాల గదిలోనే ఈ దారుణ ఘాతుకానికి పాల్పడ్డినట్లు సమాచారం.

స్కూల్‌కు ఫోరెన్సిక్ టీమ్…..

ఘటన జరిగిన రాప్తాడు ప్రభుత్వ పాఠశాలకు ఫోరెన్సిక్ బృందం చేరుకుని క్లాస్ రూమ్‌ను సమగ్రంగా పరిశీలించింది. దాడికి ఉపయోగించిన ఎలక్ట్రిక్ రంపం మెషీన్‌ను ఘటనా స్థలంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రక్తపు నమూనాలు మరియు ఇతర ఆధారాలను నమోదు చేసుకున్నారు. రంపంతో జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పాఠశాల ప్రాంగణంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించడంలో వైఫల్యం చెందడం, పర్యవేక్షణ లోపం వహించడంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు ZP ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సర్కార్ బడుల్లో విద్యార్థినుల భద్రత గాలిలో కలిసిపోయిందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు రాప్తాడులో భారీ ఆందోళనకు దిగాయి. పాఠశాలల్లో కనీస రక్షణ కల్పించడంలో ప్రభుత్వం మరియు విద్యాశాఖ విఫలమయ్యాయని మండిపడ్డారు. బాధితురాలి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, ఉన్మాది హేమంత్‌ను చట్టప్రకారం అత్యంత కఠినంగా శిక్షించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు.

రాప్తాడు ఘటన - అసలేం జరిగింది..?

  • అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో దాడి చేశాడు.
  • ఉదయాన్నే అందరూ చూస్తుండగానే పాఠశాల కాంపౌండ్‌లోకి ప్రవేశించిన సదరు దుండగుడు…. నేరుగా క్లాస్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న పదో తరగతి విద్యార్థినిని లక్ష్యంగా చేసుకుని రంపంతో దారుణంగా కోశాడు.
  • ఈ ఊహించని ఘాతుకంతో పాఠశాల ఆవరణ అంతా ఒక్కసారిగా కేకలు, భయాందోళనలతో అట్టుడికిపోయింది. దారుణ దాడి కారణంగా సదరు బాలిక కుడిచేయి తెగిపడిపోగా, ముఖం మరియు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలయ్యాయి.
  • పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
  • బాధిత బాలికకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
  • బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. బాధిత కుటుంబాన్ని సీఎం పరామర్శించి.. భరోసా ఇచ్చారు.
  • రాప్తాడు ఘటనను ఏపీ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దాడి ఘటనతో పాటు అడ్డుకునే క్రమంలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపైనా ఆరా తీశారు. విద్యార్థినులిద్దరికీ అందుతున్న వైద్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks