...
...
Next Story

‘నన్ను మీ ఆంధ్రా బిడ్డగా భావించండి' … మదనపల్లె సభలో అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రకటించారు. ఈ సందర్భంగా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనని ఆంధ్రా బిడ్డగా భావించాలని కోరారు.

Published on: Oct 2, 2026, 18:18:02 IST
Advertisement

రాష్ట్రంలో ఏకంగా రూ.1 లక్ష కోట్ల బారీ పెట్టుబడితో కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు…. రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు రూ. 60,000 కోట్ల ఆదాయం సమకూరనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు.

అనంత్ అంబానీ కీలక ప్రకటన!
అనంత్ అంబానీ కీలక ప్రకటన!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం నిర్వహించిన "రాయలసీమ హార్టికల్చర్ హబ్", "ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్" శంకుస్థాపన మహోత్సవంలో ముఖ్యమంత్రి ]చంద్రబాబు నాయుడితో కలిసి అనంత్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ పెట్టుబడులు దారితీస్తాయని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. "ఇంతకాలం దేశానికి ఆహార భద్రతను అందించిన మన రైతన్నలు, ఇకపై ఇంధన భద్రతను కూడా బలోపేతం చేస్తారు. ఇంధన రంధ్రంలో భారత్‌ను స్వయంసమృద్ధి దిశగా నడిపిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడితో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు పెట్టేందుకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు," అని అంబానీ తెలిపారు.

కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ఏంటి….?

వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, ఆహార వ్యర్థాలు, ఇతర జీవ వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసి, మీథేన్ వాయువును వేరు చేయడం ద్వారా ఈ ఇంధనాన్ని తయారు చేస్తారు. ఇది సంప్రదాయ సహజ వాయువుకు అత్యంత స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనిని రవాణా ఇంధనంగా, పరిశ్రమల్లోనూ వినియోగిస్తారు. ఈ విధానం వల్ల వ్యర్థాల నిర్వహణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు మాత్రమే కాకుండా, విదేశీ శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుంది. అంతేకాకుండా, వ్యర్థాల నుంచి ఇంధనంతో పాటు పోషకాలతో కూడిన ఉచిత సేంద్రీయ ఎరువులు లభించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుంది.

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు వ్యూహాత్మక పెట్టుబడులు, డిజిటల్ నెట్‌వర్క్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రిలయన్స్ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆధునిక సాంకేతికతలను భారతీయ రైతుల సంప్రదాయ అనుభవంతో జోడిస్తామని చెప్పారు. చీడపీడల గుర్తింపు, డ్రోన్ల ద్వారా పంట పర్యవేక్షణ, ఆధునిక నీటిపారుదల విధానాలు, రోబోటిక్స్, మార్కెట్ ధరల సమాచారాన్ని రైతులకు సులభంగా అందిస్తామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వర్క్‌షాప్‌ల ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాలను లక్షలాది మంది రైతులకు మాతృభాషలోనే చేరవేసేందుకు రిలయన్స్ జియో భాగస్వామ్యం వహిస్తుందని చెప్పారు. గ్రామీణ యువతను డిజిటల్ అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు. జియో ఇప్పటికే 'జియో కృషి' అనే ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిందని, రిలయన్స్ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని జామనగర్‌లో బయో-ఎనర్జీ రీసెర్చ్ సెంటర్‌ను కూడా నెలకొల్పినట్లు వివరించారు.

మీ బిడ్డగా చూడండి - ఆసక్తికర వ్యాఖ్యలు

కార్యక్రమంలో అనంత్ అంబానీ మాట్లాడిన మాటలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "నన్ను మీ ఆంధ్రా బిడ్డగా భావించండి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబానీ ఆత్మీయంగా కోరారు.

"ఈ రోజు మనం కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేయడం లేదు.. పల్లెసీమల వ్యవస్థాపకతకు, బలమైన గ్రామాలకు, సుస్థిర భారత్‌కు, ముఖ్యంగా మన రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పునాది వేస్తున్నాం," అని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత యువతకు ఊరిలోనే సాంకేతికత, నైపుణ్యాలు అందిస్తే వ్యవసాయం వారికి ఆకర్షణీయమైన కెరీర్‌గా మారుతుందని అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks