AP RTGS CCTV360 : ఏఐ కెమెరాలతో నేరగాళ్లకు చెక్ - వాహనాల రికవరీనే కాదు క్లిష్టమైన కేసుల్లోనూ…!
AP RTGS CCTV360 : ఆంధ్రప్రదేశ్‌లో నేరాల నియంత్రణకు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థ కీలకంగా మారింది. ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా దొంగిలించిన వాహనాలు, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీని పోలీసులు వేగంగా గుర్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరగాళ్ల ఆటకట్టించడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ఆర్టీజీఎస్ సీసీటీవీ360' వ్యవస్థ ఇప్పుడు వాహన చోరుల పాలిట సింహస్వప్నంగా మారింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో పనిచేసే ఈ నిఘా నేత్రాలు, చోరీకి గురైన వాహనాల ఆచూకీని రియల్ టైమ్‌లో పసిగడుతూ పోలీసులకు వేగంగా సమాచారాన్ని అందిస్తున్నాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 81 వాహనాల రికవరీకి ఈ వ్యవస్థ ఎంతగానో తోడ్పడింది.

ఒకే ఒక్క అలర్ట్….. 7వాహనాల స్వాధీనం
గుంటూరు నగరం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటనే ఇందుకు నిదర్శనం. అక్కడ ఒక హోండా యాక్టివా స్కూటర్ దొంగతనానికి గురైంది. పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో, వారు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థ సహాయాన్ని కోరారు. పోలీసులు అందించిన డేటా ఆధారంగా మ్యాట్రిక్ సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు.
జూన్ 17వ తేదీన సదరు స్కూటర్ గుంటూరులోని ఒక ప్రధాన కూడలి వద్ద కదులుతున్నట్లు ఏఐ వ్యవస్థ రియల్ టైమ్ అలర్ట్‌ను పంపింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఒక్క స్కూటరే కాకుండా, నిందితుడు దొంగిలించిన మరో ఆరు వాహనాల గుట్టు కూడా రట్టయింది. మొత్తం ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తల్లి ఒడికి చేరిన చంటిబిడ్డ…
కేవలం వాహనాల దొంగతనాలే కాకుండా, అపహరణకు గురైన ప్రాణాలను కాపాడటంలోనూ ఈ వ్యవస్థ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన బాపట్ల జిల్లా చీరాలలో ఒక హృదయవిదారక ఘటన జరిగింది. చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఫుట్‌పాత్‌పై జీవించే ఒక నిరుపేద మహిళ, తన ఆరు నెలల చంటిబిడ్డను పక్కన పెట్టుకుని నిద్రిస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బాబును ఎత్తుకెళ్లాడు.
బాపట్ల పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడి కదలికలను గుర్తించేందుకు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 సహాయం తీసుకున్నారు. ఏఐ ఆధారిత కెమెరాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి, కేవలం 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకునేలా ఖచ్చితమైన సమాచారాన్ని అందించాయి. దాంతో పోలీసులు బాలుడిని సురక్షితంగా రక్షించి, ఆ కన్నతల్లి ఒడికి చేర్చారు.
14,750 కెమెరాలతో మూడో కన్ను నిఘా
సురక్షిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఆధ్వర్యంలో ఈ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,750 సీసీ కెమెరాలను ఈ ఏఐ ఆధారిత ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థకు అనుసంధానించారు.
గడిచిన నాలుగు నెలల్లో ఈ సాంకేతికత ఆధారంగా పోలీసులు ఎన్నో కేసులు చేధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి….
- వాహనాల స్వాధీనం : దొంగతనానికి గురైన 80కి పైగా వాహనాలను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు.
- మిస్సింగ్ కేసుల పరిష్కారం : వివిధ ప్రాంతాల నుంచి అదృశ్యమైన 73 మంది ఆచూకీని ఈ నిఘా నేత్రాలు కనుగొన్నాయి.
- నేరస్థుల అరెస్ట్ : విభిన్న కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న 52 మంది నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.
క్లిష్టమైన కేసులకు మోక్షం….
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ తన వాహనం పోయిందని ఫిర్యాదు చేయగా, విచారణలో కుటుంబ తగాదాల వల్లే ఆమె భర్త దాన్ని తీసుకెళ్లినట్లు ఈ కెమెరాల సాయంతో తేలింది. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన బైక్‌ను చిల్లకల్లు వద్ద, ఎ.ఎస్.నగర్ పరిధిలోని మరో వాహనాన్ని ఈ సాంకేతికతతోనే పట్టుకున్నారు. విస్సన్నపేటలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాహన చోరీ కేసుతో పాటు మరో కేసును కూడా దీని ద్వారానే ఛేదించారు. అలాగే మదనపల్లె టూ టౌన్ పరిధిలో ఏప్రిల్ 27న నమోదైన ద్విచక్ర వాహన చోరీ కేసును సైతం సాంకేతిక ఆధారాలతోనే పరిష్కరించారు.
మనుషుల అదృశ్యం కేసుల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికత అద్భుతంగా పనిచేస్తోంది. మైలవరం పరిధిలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక మహిళ అదృశ్యం కేసును, ఎస్.ఆర్.పేటలో అదృశ్యమైన ఒక బాలిక కేసును కొన్ని గంటల్లోనే పరిష్కరించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెడ్డిగూడెంలో నిగూఢంగా మారిన ఒక వ్యక్తి అదృశ్యం కేసును కూడా అతడి వాహన కదలికల ఆధారంగా ఛేదించారు. ఆధునిక సాంకేతికత తోడైతే నేరాల దర్యాప్తు ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థే నిదర్శనం… !
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

