Tirumala Darshan : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - క్యూ కాంప్లెక్స్ లో వెయిటింగ్ లేకుండానే దర్శనం!
Tirumala Darshan Timing : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలోనూ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో టీటీడీ క్యూలైన్ల నుంచి నేరుగా భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది. సర్వదర్శనానికి కేవలం 4 గంటల సమయమే పడుతోంది.
Tirumala Darshan Timing : కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని అంతా భావించారు. కానీ, తిరుమలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. గత కొన్నిరోజులుగా కిటకిటలాడిన క్యూలైన్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా…. టీటీడీ అధికారులు భక్తులను నేరుగా సర్వదర్శనం క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.

ఉదయం 8 గంటల తర్వాత వచ్చిన భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతోందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే రూ.300 శీఘ్రదర్శనం ద్వారా వెళ్లే భక్తులకు కూడా సుమారు 4 గంటల్లోనే స్వామివారి దివ్య మంగళ స్వరూప దర్శనం లభిస్తోంది. ఉత్సవాల వేళ ఇంత తక్కువ సమయంలో స్వామివారి దర్శనం కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న తిరుమలలో నమోదైన గణాంకాలు:
తిరుమలేశుని దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ రోజువారీ గణాంకాలను వెల్లడించింది. నిన్న (సోమవారం) ఒక్క రోజే మొత్తం 88,210 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తలనీలాల సమర్పణ కార్యక్రమం కింద 30,192 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.
భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి ఒక్కరోజే రూ. 4.23 కోట్ల భారీ ఆదాయం లభించింది. ప్రసాదాల విక్రయాలకు సంబంధించి నిన్న ఒక్కరోజే భక్తులు 4.36 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. భక్తుల ఆకలి తీర్చే నిత్యాన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా 2.67 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే తిరుమలలోని అశ్విని ఆసుపత్రి వైద్య సేవలను 3,398 మంది భక్తులు వినియోగించుకున్నారు.
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో కంపార్టుమెంట్లు ఏవీ నిండకుండా నేరుగా లైన్లలోకి భక్తులను పంపుతున్నారు. ఈ రద్దీ లేని వాతావరణం శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే సామాన్య భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

