కాల్చి బూడిద చేశారు.. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో దిగ్భ్రాంతికర నిజాలు
Sai Krishna Custodial Death : గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి సరేష్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు.
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన గాదే సాయికృష్ణ కస్టోడియస్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న రియల్టర్ గులివిందల సురేష్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచిన సిట్.. శుక్రవారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పోలీసుల అమానుష చర్యలు, ఆధారాల విధ్వంసం, మృతదేహం దహనం వరకు జరిగిన వరుస పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించింది.

మే 7న కృష్ణలంక సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుల్ నానిలు సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో దారుణంగా కొట్టారని, ఆ సమయంలో రియల్టర్ సురేష్ అక్కడే ఉన్నాడని సిట్ పేర్కొంది. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన సాయికృష్ణను రాణిగారితోటలోని ఒక నిర్మానుష్య భవనానికి తరలించారు.
మే 12న సురేష్ ఆ భవనానికి వెళ్లగా సాయికృష్ణ తీవ్ర గాయాలతో ఉన్నాడు. అతను కోలుకునే వరకు అక్కడే ఉంచాలని సీఐ నాగరాజు సూచించారు. సరైన వైద్యం అందక సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడు.
మే 12, 13 మధ్యరాత్రి సీఐ నాగరాజు, అశోక్, సురేష్ కలిసి సాయికృష్ణ మృతదేహాన్ని ఒక బొంతలో చుట్టి, ద్విచక్రవాహనంపై స్వర్గపురి శ్మశానవాటికకు తరలించారు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా దహనం చేశారు. మే 18న మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా మిగిలి ఉన్నాయా అని చూడటానికి సురేష్ మళ్లీ శ్మశానవాటికకు వెళ్లాడు.
కేసునుంచి తప్పించుకోవడానికి సాంకేతిక ఆధారాలను, సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేశారు. సాయికృష్ణ కస్టడీలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఫోన్ నుండి డిలీట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. సిట్ అధికారులు శ్మశానవాటిక నుండి బూడిద, ఎముకల అవశేషాలు, కాలిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు వాహనాలను సీజ్ చేశారు.
సాయికృష్ణ మేనమామ ముల్లాపూడి నవరంగ్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని ఉపసంహరించుకోవాలని మే 31న కృష్ణలంక పోలీసులతో కలిసి సురేష్ ఆయన ఇంటికి వెళ్లాడు. కేసు ఉపసంహరణకు భారీగా పరిహారం ఆఫర్ చేయగా, నవరంగ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఈ దారుణ ఉదంతంపై మరింత లోతైన విచారణ జరిపేందుకు నిందితుడు సురేష్‌ను 15 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి సెప్టెంబర్ 24 వరకు రిమాండ్ విధించడంతో, అతడిని నూజివీడు జైలుకు తరలించారు.
సాయికృష్ణ ఆకస్మిక అదృశ్యంపై కుటుంబ సభ్యులు మొదటి నుంచీ కృష్ణలంక పోలీసులపైనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ కస్టడీలోనే తీవ్ర హింసకు గురై మరణించాడని, ఆపై మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాల్చివేశారని ఆరోపిస్తూ బాధితుడి కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించడంతో ఒక్కొక్కరి పాత్ర బయటకు వస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


