అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం- లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి!

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్​ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మరణించినట్టు సమాచారం.

Published on: Dec 12, 2025, 07:25:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది! చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఘోర రోడ్డు ప్రమాదం..
ఘోర రోడ్డు ప్రమాదం..

లోయలో పడిన బస్సు నంబరు AP39 UM6543. అరకు నుంచి భద్రాచలం వెళుతుండగా రాజు గారి మెట్టు మలువు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో 35కిపైగా మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. బస్సు లోయలో పడిన వెంటనే ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అనేక మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నించారు.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు. గాయపడిన వారిని వెంటనే చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఘటనాస్థలంలో 3 అంబులెన్సులు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఈ బస్సు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక వాహనాలు ఘాట్​ రోడ్డులో నిలిచిపోయినట్టు సమాచారం.

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, అతివేగంతో బస్సు నడపడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

రోడ్డు ప్రమాదానికి గురైన వారందరు చిత్తూరు జిల్లా వాసులు అని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో దాదాపు అందరు వృద్ధులు అని వివరించారు.

ఘటనాస్థలం వద్ద నుంచి వస్తున్న వీడియోలు హృదయవిదారకంగా ఉన్నాయి. ప్రాణాలతో బయటపడి వారిలో చాలా మంది తమ బంధువులను పోగొట్టుకున్నారు. తీవ్ర బాధతో వారి మృతదేహాలను పట్టుకుని విలపిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి.

అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం- అధికారులతో మాట్లాడిన సీఎం..

అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అందుతున్న చికిత్సపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్​ అధికారులను ఆదేశించారు.

మంత్రులు అనిత, సంధ్యారాణి ఘటనపై ఎస్పీ, కలెక్టర్​తో మాట్లాడారు. అనంతరం ఘటనాస్థలానికి బయలుదేరారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More