విశాఖ తీరంలో ప్రమాదం - వేటకెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా, ఆరుగురు గల్లంతు!
విశాఖపట్నం తీరంలో విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు మత్స్యకారులతో ప్రయాణిస్తున్న ఒక చేపల వేట బోటు సముద్రంలో బోల్తా పడింది. వీరిలో ఒకరిని రక్షించగా… మిగిలిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి కోసం నౌకాదళ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగాయి.
నైరుతి రుతుపవనాల రాకతో సముద్రంలో ఏర్పడిన అల్లకల్లోల వాతావరణం, బలమైన ఈదురుగాలుల కారణంగా విశాఖపట్నం తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులతో కూడిన బోటు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతు కాగా…. మరో వ్యక్తిని కాపాడారు.

విశాఖపట్నం ఫిషింగ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు తెలిపిన వివరాల ప్రకారం... జూలై 1వ తేదీన ఈ ఏడుగురు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వారు జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకల్లా తిరిగి తీరానికి చేరుకోవాల్సి ఉంది. ఈ మేరకు వారు తమ కుటుంబ సభ్యులకు కూడా ముందుగా సమాచారం అందించారు.
ఫోన్లు స్విచ్ఛాప్.. రంగంలోకి కోస్ట్ గార్డ్
శనివారం (జూలై 4) మధ్యాహ్నం దాటినా మత్స్యకారులు తిరిగి రాకపోవడం, వారి మొబైల్ ఫోన్లు అన్నీ స్విచ్ఛాప్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తక్షణమే మెరైన్ పోలీస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులను ఆశ్రయించారు. మత్స్యకారులు తమ వేట ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని…, భారీ గాలుల ధాటికి బోటు అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయి ఉంటుందని లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. రుతుపవనాల ప్రభావంతో సుమారు 400 బోట్లు వేటకు వెళ్లగా…. మారుతున్న వాతావరణం. ఈదురుగాలుల వల్ల పలు బోట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆయన తెలిపారు.
ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ - సీఎం ఆదేశాలు
మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విశాఖపట్నంలోని ఉన్నతాధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడి… సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు. గల్లంతైన వారిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు కోస్ట్ గార్డ్ నౌకలతో పాటు భారత నౌకాదళానికి (Indian Navy) చెందిన ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దించాలని సీఎం ఆదేశించారు. మెరైన్ పోలీస్, వైజాగ్ సిటీ పోలీస్ యంత్రాంగాలు పరస్పర సమన్వయంతో సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని, రెస్క్యూ ఆపరేషన్ అప్‌డేట్స్‌ను తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు…. గాలింపు చర్యల వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకరంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఇప్పటికే నేవీకి చెందిన హెలీకాప్టర్ తో గాలింపు చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలు తెలియజేయాలని నిర్దేశించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

