వివిధ రంగాల్లో గూగుల్‌తో కలిసి పని చేసేందుకు ఏపీలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ గవర్నెన్స్‌లోనూ గూగుల్ భాగస్వామ్యం కానుంది. వివిధ రంగాల్లో గూగుల్‌తో కలిసి పని చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Published on: Jun 15, 2026, 18:21:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివిధ రంగాల్లో సంయుక్తంగా పనిచేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ నిర్ణయించాయి. సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ మేరకు జరిగిన చర్చల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి ఇరువురు వచ్చారు.

సింగపూర్ పర్యటనలో చంద్రబాబు
సింగపూర్ పర్యటనలో చంద్రబాబు

అలాగే డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామి కావాలని కరణ్ బజ్వాను ముఖ్యమంత్రి కోరారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గూగుల్ ఆసియా - పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో వివిధ కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు.

మరోవైపు ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై గూగుల్ క్లౌడ్‌ సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు. ఆధునిక క్లౌడ్ సాంకేతికతలను వినియోగించుకుని రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలనేది సీఎం వివరించారు. అలాగే ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో యువతకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఏఐ స్కిల్లింగ్, క్లౌడ్ సర్టిఫికేషన్ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని... దీనికి గూగుల్ నుంచి సహకారం కావాలన్నారు.

సింగపూర్ వేదికగా సీఎం చంద్రబాబు జరిపిన వరుస సమావేశాల్లో భాగంగా వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై వైసీహెచ్ గ్రూప్‌తో సీఎం చర్చించారు. ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో 1,053 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం ఉందని... లాజిస్టిక్స్ పరంగా పెట్టుబడులు పెట్టేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని సీఎం వివరించారు.

హైవేలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే కనెక్టవిటీ ఉందని... లాజిస్టిక్స్ వ్యయం తగ్గించేందుకు ప్రణాళికతో పని చేస్తున్నామంటూ ఏపీలోని లాజిస్టిక్స్ వసతులు.. ఉన్న వనరులను వైసీహెచ్ గ్రూప్ ప్రతినిధుల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. మరోవైపు రాష్ట్రంలో ఉద్యానరంగంలో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఆక్వాకల్చర్‌లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. పెట్టుబడులు పెట్టాలని వైసీహెచ్ గ్రూప్‌ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

ఈ పర్యటనలో భాగంగా యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయాలని, దీనికి భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. యూఎన్ హాబిటాట్‌తో సంపూర్ణ భాగస్వామ్యం కోరుకుంటున్నామని అనాక్లాడియాకు సీఎం తెలిపారు. దీనిపై యూఎన్ హాబిటాట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. యూనివర్శిటీల మధ్య భాగస్వామ్యం, ప్రణాళిక దశలో ఎస్డీజీలను చేర్చడం, ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్ సహకారం పైనా యూఎన్ హాబిటాట్ ప్రతినిధులతో సీఎం చర్చించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More