శ్రీశైలం మల్లన్న భక్తులకు అప్డేట్ - నవంబర్ నెల ఆర్జిత సేవల టికెట్లు విడుదల, బుకింగ్ ప్రాసెస్ ఇలా
Srisailam Temple Darsanam Tickets : శ్రీశైల మల్లికార్జున స్వామి వారి నవంబరు నెల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. 'మనమిత్ర' వాట్సాప్ నంబర్, అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
Srisailam Temple Darsanam Tickets : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు దేవస్థాన అధికారులు కీలక సమాచారం అందించారు. నవంబరు నెలకు సంబంధించి వివిధ రకాల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు.

మొత్తం అందుబాటులో ఉన్న టికెట్లలో 80 శాతం టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'మనమిత్ర' వాట్సాప్ సేవల ద్వారా కేటాయిస్తున్నారు. మిగిలిన 20 శాతం టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచారు. ఖాళీల లభ్యతను బట్టి సేవ లేదా దర్శన సమయానికి ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.
బుకింగ్ ప్రాసెస్ ఇలా….
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సేవల కోసం అందుబాటులోకి తెచ్చిన 'మనమిత్ర' వాట్సాప్ నంబరు 95523 00009 కి కేవలం ఒక మెసేజ్ పంపడం ద్వారా శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లను అత్యంత సులభంగా పొందవచ్చు.
కేవలం దర్శనాలు మాత్రమే కాకుండా, దేవస్థానంలో నిర్వహించే 14 రకాల కీలక ఆర్జిత సేవా టికెట్లను కూడా ఈ వాట్సాప్ నంబర్ ద్వారానే భక్తులు కైవసం చేసుకోవచ్చు.
14 రకాల సేవా టికెట్లు వాట్సాప్‌లోనే లభిస్తాయి. అంతేకాకుండా,….శ్రీశైల క్షేత్రానికి చేరుకునే భక్తులకు బుకింగ్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు రాకుండా సహాయపడేందుకు ఆలయ ప్రాంగణంలోని పలు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక వాట్సాప్ సహాయ కేంద్రాలనుకూడా దేవస్థానం యంత్రాంగం ఏర్పాటు చేసింది.
కార్తీక మాసోత్సవాల దృష్ట్యా కొన్ని సేవల రద్దు…
నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు అత్యంత పవిత్రమైన కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ రోజుల్లో క్షేత్రానికి భక్తుల రద్దీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా, వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కార్తీక మాసంలో రూ.5,000 విలువైన గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 సామూహిక అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. వీటితో పాటు ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవల టికెట్లను కూడా ఈ సమయంలో తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇక కార్తీక మాస రద్దీ రోజుల్లో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి అంతరాలయంలో జరిగే రూ.1,000 కుంకుమార్చన టికెట్లు పొందిన భక్తులకు ఆశీర్వచన మండపంలో పూజ చేసుకోవడానికి వీలు కల్పించారు. అయితే, ఆర్జిత హోమాలు, నిత్య కల్యాణోత్సవం వంటి ఇతర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
భక్తులకు ముఖ్యమైన సూచనలు:
- ఆన్లైన్ లేదా వాట్సాప్ ద్వారా టికెట్ పొందిన భక్తులు విధిగా ఆ టికెట్ ప్రింటవుట్ (హార్డ్ కాపీ) తీసుకురావాల్సి ఉంటుంది. డిజిటల్ కాపీలను అనుమతించరు.
- టికెట్‌తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఆధార్ జిరాక్స్ కాపీని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
- దేవస్థానం క్యూలైన్ల వద్ద అధికారులు స్కేనర్ల ద్వారా టికెట్‌ను స్కాన్ చేసి, భక్తుల ఆధార్ వివరాలతో సరిచూసిన తర్వాత మాత్రమే దర్శనానికి లేదా ఆర్జిత సేవలకు అనుమతిస్తారు.
- ఎలాంటి టికెట్లు లేని సాధారణ భక్తుల ఉచిత సర్వదర్శనం కోసం ప్రతిరోజూ ఉదయం 4:30 గంటల నుంచే క్యూలైన్లు అందుబాటులో ఉంటాయి.
- ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు దేవస్థానం అధికారిక వెబ్సైట్ www.tms.ap.gov.in ను సందర్శించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

