...
...
Next Story

సివిల్ జడ్జి ఉద్యోగాలు: 2026 లా గ్రాడ్యుయేట్లకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జి నియామకాల్లో 2026 లా గ్రాడ్యుయేట్లకు ఏడాది ప్రాక్టీస్ మినహాయింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సమర్థించిన సీజేఐ ధర్మాసనం, కొత్తవారు ఏడాది పాటు కోర్టుల్లో పనిచేసి అనుభవం గడించాలని స్పష్టం చేసింది.

Published on: Nov 19, 2026, 20:55:11 IST
Advertisement

న్యూఢిల్లీ: జూనియర్ సివిల్ జడ్జి (సివిల్ జడ్జి - జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి సంబంధించి 2026 బ్యాచ్ లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. న్యాయవాద వృత్తిలో కనీసం ఏడాది ప్రాక్టీస్ ఉన్నట్లు పరిగణించే (డీమ్డ్ ప్రాక్టీస్) మినహాయింపును 2026లో లా పూర్తి చేసిన అభ్యర్థులకు వర్తింపజేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం గురువారం నిరాకరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం సమర్థించింది.

సివిల్ జడ్జి ఉద్యోగాలు: 2026 లా గ్రాడ్యుయేట్లకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
సివిల్ జడ్జి ఉద్యోగాలు: 2026 లా గ్రాడ్యుయేట్లకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

న్యాయవ్యవస్థలో కింది స్థాయి కోర్టుల న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి, అభ్యర్థులకు కనీస ప్రాక్టీస్ అనుభవం ఉండాలనే నిబంధనపై గత కొంతకాలంగా న్యాయపరమైన స్పష్టత వస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం 2026 సెప్టెంబర్ 25న నియామక నోటిఫికేషన్ వెలువడింది. ఆ నోటిఫికేషన్ నాటికి లా డిగ్రీ పూర్తి చేసి ఏడాది గడవని అభ్యర్థులు తమకు కూడా పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరుతూ గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి అభ్యర్థనను హైకోర్టు కొట్టివేయడంతో, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.

భూమిక ట్రస్ట్ తీర్పు ప్రయోజనం మాకూ ఇవ్వాలన్న పిటిషనర్లు

గతంలో 'భూమిక ట్రస్ట్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకేసారి మినహాయింపు (వన్-టైమ్ కన్సెషన్) ప్రయోజనాన్ని తమకూ వర్తింపజేయాలని పిటిషనర్లు కోరారు. లా డిగ్రీ పూర్తి చేసినా లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో తాత్కాలిక నమోదు (ప్రొవిజనల్ ఎన్‌రోల్‌మెంట్) చేసుకున్నా ఏడాది గడవకపోయినా సరే, లా గ్రాడ్యుయేట్లందరినీ నియామక ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతించాలని వారు వాదించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ వాదనలు వినిపిస్తూ, భూమిక ట్రస్ట్ తీర్పులో కల్పించిన మినహాయింపు ఆధారంగా 2026 గ్రాడ్యుయేట్లకు కూడా డీమ్డ్ ప్రాక్టీస్ ప్రయోజనాన్ని కల్పించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

2025 బ్యాచ్‌కు, 2026 బ్యాచ్‌కు తేడా ఇదేనన్న సీజేఐ

"2026లో కొత్తగా నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఎలా అర్హులవుతారు? అసలు తీర్పు 2025లో వచ్చింది. మేము సవరించిన తీర్పు వెలువరించే సమయానికి 2026 ఆగస్టు అయింది. అంటే మధ్యలో ఏడాదికి పైగా విరామం ఉంది. 2025లో అర్హత సాధించిన లా గ్రాడ్యుయేట్లు 2026 ఆగస్టులో మేము తీర్పు ఇచ్చే నాటికి ఏడాది సమయం పూర్తి చేసుకున్నారు. ఆ ఏడాది కాలంలో వారు ఇళ్లలో ఖాళీగా కూర్చుని ఉండరని భావించి డీమ్డ్ ప్రాక్టీస్ వెసులుబాటు కల్పించాం. వారు ఏదో ఒక లా ఆఫీసులో జూనియర్లుగా పనిచేస్తూ, ఛాంబర్లు, కోర్టులకు వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి ఏడాది ప్రాక్టీస్ ఉన్నట్లుగా పరిగణించాలని చెప్పాం" అని సీజేఐ వివరించారు.

ఏడాది పాటు కోర్టుల్లో పనిచేసి నేర్చుకోండి..

పిటిషనర్ మాదిరిగానే ఇంకా చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, కొత్త గ్రాడ్యుయేట్లు ముందుగా ప్రాక్టికల్ అనుభవం గడించాలని హితవు పలికారు.

"వారిని ముందు పనిచేయనివ్వండి.. వారిలో కొందరు మీ ఆఫీసులో, మరికొందరు ఇతర లాయర్ల ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు. ఏడాది పాటు వారు ఎంతో కొంత నేర్చుకుంటారు. ఆ తర్వాత వారిని తప్పకుండా ఆహ్వానిస్తాం" అని సీజేఐ వ్యాఖ్యానించారు.

ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే?

అంతకుముందు ఈ వివాదంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. 2026 సెప్టెంబర్ 25 నాటి నియామక నోటిఫికేషన్‌కు ఏడాది కంటే తక్కువ సమయంలో గ్రాడ్యుయేషన్ లేదా ప్రొవిజనల్ ఎన్‌రోల్‌మెంట్ పొందిన అభ్యర్థులకు ఏడాది ప్రాక్టీస్ పూర్తయినట్లు భావించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. డీమ్డ్ ప్రాక్టీస్ కాలానికి సంబంధించి ప్రత్యేకంగా 'ప్రాక్టీస్ సర్టిఫికెట్' సమర్పించాలనే నిబంధన నుంచి మాత్రమే సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందని, అంతేతప్ప గ్రాడ్యుయేషన్ లేదా ఎన్‌రోల్‌మెంట్ పూర్తయి కచ్చితంగా ఏడాది గడవాలనే నిబంధనను తొలగించలేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు సైతం ఇదే అభిప్రాయాన్ని సమర్థించడంతో 2026 బ్యాచ్ అభ్యర్థులు తదుపరి నోటిఫికేషన్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks