SV Museum in Tirumala : తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు శ్రీవారి వైభవాన్ని, ఆలయ చరిత్రను డిజిటల్ రూపంలో కళ్లకు కట్టేలా చూపేందుకు టీటీడీ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియాన్ని అత్యాధునిక సాంకేతికతతో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో టీటీడీ పునర్నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులకు ఇదొక ఆధ్యాత్మిక, విజ్ఞానదాయకమైన అద్భుత అనుభూతిని అందించనుంది.
టాటా కన్సల్టెన్సీ సౌజన్యంతో….

తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పనుల పురోగతిని పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.
సుమారు 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియంలో దాదాపు లక్ష చదరపు అడుగుల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. మొత్తం 14 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
తిరుమల క్షేత్ర వైభవం, ఆలయ చారిత్రక నేపథ్యం, శాసనాలు, అన్నమాచార్య గ్యాలరీ, పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి వివిధ రాజవంశీయులకు శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని గ్యాలరీలలో ప్రదర్శిస్తారు.
మ్యూజియాన్ని దీర్ఘకాలిక సుస్థిరతతో ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడంపై కూడా చర్చించామని అదనపు ఈవో తెలిపారు. భక్తులకు మెరుగైన అనుభవం కల్పించేలా ప్రవేశ, నిష్క్రమణ సదుపాయాలు, క్యాఫెటీరియా, సావనీర్ షాప్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. భక్తుల తిరుమల యాత్రకు ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక అనుభూతి కలిగించ లా ఈ మ్యూజియాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.