రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కడప, తిరుపతి, రాయచోటి, రాజంపేట, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నాయని…. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ అడ్డుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అధికార పార్టీ అరాచకాలపై, పోలీసుల ఏకపక్ష వైఖరిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
పలు ఘటనలపై ఎస్ఈసీకి ఫిర్యాదు

కడప నగరంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు నామినేషన్ కేంద్రాలను ముట్టడించి, వైఎస్సార్సీపీ అభ్యర్థులను లోపలికి వెళ్లకుండా రహదారులపైనే అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసు అధికారులు కళ్లప్పగించి చూస్తుండగానే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ చేతిలో ఉన్న అధికారిక పత్రాలతో సహా వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ కాగితాలను లాక్కుని చింపివేశారని వెల్లడించింది. అంతేకాకుండా వైఎస్సార్సీపీ కార్యాలయం సమీపంలో కత్తులతో తిరిగిన టీడీపీ మూకలు, మాజీ కార్పొరేటర్ కుమారుడు మురాద్పై భౌతిక దాడికి దిగారని తెలిపింది.
తిరుపతిలో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి శ్రీ వాసు యాదవ్కు ప్రతిపాదకుడిగా వచ్చిన లోక్సభ సభ్యుడు డాక్టర్ ఎం. గురుమూర్తిని సైతం పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని పార్టీ ఆరోపించింది. ఎంపీ గురుమూర్తి సమక్షంలోనే పోలీసుల ముందే టీడీపీ కార్యకర్తలు నామినేషన్ పత్రాలను చింపివేశారని వివరించింది. ఎంఆర్ పల్లిలో పోటీకి వచ్చిన మహిళా అభ్యర్థిపై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగగా, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఎదురు వైఎస్సార్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారని మండిపడింది.
రాయచోటి నియోజకవర్గంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్పై మానస రెస్టారెంట్ సమీపంలో టీడీపీ మూకలు దాడికి యత్నించి, ఆయన వాహనాన్ని ధ్వంసం చేశాయని వైఎస్సార్సీపీ తెలిపింది. ఆయనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, అభ్యర్థిని రక్షణ పేరుతో ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కు తిప్పుతూ గడిపారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో అడుగుపెట్టకుండా టీడీపీ శ్రేణులు రహదారులను దిగ్బంధించాయని పేర్కొంది. రాజంపేట, దర్శి ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు బలవంతంగా లాక్కొని ధ్వంసం చేశారని వివరించింది.
చర్యలు తీసుకోవాలి - వైసీపీ
ఈ హింసాత్మక ఘటనలతో పాటు దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా వ్యవహరించని పోలీసు అధికారుల తీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు తటస్థ భద్రతా బలగాలను రంగంలోకి దించాలని కోరారు. దాడుల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన బాధితులకు మరో అవకాశం కల్పించాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు. భయానక వాతావరణం, దౌర్జన్యాల మధ్య ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
{{/usCountry}}ఈ హింసాత్మక ఘటనలతో పాటు దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా వ్యవహరించని పోలీసు అధికారుల తీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు తటస్థ భద్రతా బలగాలను రంగంలోకి దించాలని కోరారు. దాడుల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన బాధితులకు మరో అవకాశం కల్పించాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు. భయానక వాతావరణం, దౌర్జన్యాల మధ్య ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
{{/usCountry}}