Tirumala Pushpayagam : తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం - ఈనెల 16న పలు సేవలు రద్దు..!

Tirumala Pushpayagam 2026 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. నవంబర్ 15న అంకురార్పణ జరగనుండగా…. 16న పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. 

Published on: Nov 10, 2026, 07:09:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tirumala Pushpayagam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 16వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏర్పాట్లు చేస్తోంది.

తిరుమల
తిరుమల

ఈనెల 15న అంకురార్పణ…

స్వామివారికి జరిగే సేవల్లో తెలిసీ తెలియక జరిగే లోపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రతీ ఏడాదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత కార్తీక మాసంలో ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నవంబరు 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి వైభవంగా అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేయనున్నారు.

మరుసటి రోజు…. అంటే నవంబర్ 16న పుష్పయాగం రోజున ఉదయం శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం కార్యక్రమాలను ముందుగా పూర్తి చేస్తారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేస్తారు.

అక్కడ ఉత్సవమూర్తులకు పవిత్ర స్నపన తిరుమంజనం వేడుకగా జరుగుతుంది. ఈ విశేష అభిషేకంలో భాగంగా స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు మొదలైన సుగంధద్రవ్యాలతో అర్చకులు పరమ పవిత్రంగా తిరుమంజనం నిర్వహిస్తారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు కన్నుల పండువగా వివిధ రకాల సుగంధ పుష్పాలు, పత్రాలతో మలయప్పస్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన టన్నుల కొద్దీ వికసించిన పువ్వులతో స్వామివారిని అలంకరించే ఈ దృశ్యం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగిస్తుంది. ఆపై సాయంత్రం వేళ సహస్రదీపాలంకార సేవ పూర్తయిన తర్వాత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిస్తారు.

పలు సేవలు రద్దు….

పుష్పయాగ మహోత్సవం సందర్భంగా నవంబర్ 16వ తేదీన ఆలయంలో జరిగే కొన్ని నిత్య ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలు జరగవు. శ్రీవారి పుష్పయాగ వేడుకలను పురస్కరించుకుని భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More