మూడు టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగ మహోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. మూడు టన్నుల పుష్పాలతో ఘనంగా నిర్వహించారు.

Published on: Jun 22, 2026, 19:34:08 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు సమర్పించారు.

గోవిందరాజస్వామివారికి పుష్పయాగ మహోత్సవం
గోవిందరాజస్వామివారికి పుష్పయాగ మహోత్సవం

అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆలయ సంప్రదాయం.

ఈ సందర్భంగా తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం, దమనము, బిల్వం, పన్నీరాకు తదితర 6 రకాల పవిత్ర పత్రాలతో కలిపి మొత్తం మూడు టన్నుల పుష్పాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు ఈ పుష్పాలను విరాళంగా అందించారు.

సాయంత్రం స్వామివారు, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్. శ్రీనివాసులు, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్ రంజిత్, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూన్ 23న వైభవంగా జరగనుంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేపట్టనున్నారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, అర్చన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

జూన్ 25న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 28న ఆర్జిత కల్యాణోత్సవం, జూన్ 29న గరుడసేవ, జూలై 2న రథోత్సవం, జూలై 3న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఈ దివ్యోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More