children Online Safety : టింగ్ టాంగ్.. ఆన్‌లైన్‌లో ఏదైనా చేసే ముందు ఆగండి.. ఆలోచించండి

children Online Safety : ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలపై సైబర్ నేరాలు 2017తో పోలిస్తే ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. అయితే చిన్నారులకు డిజిటల్ ప్రపంచం సురక్షితంగా ఉండేలా చేసేందుకు CRY క్యాంపెయిన్ ప్లాన్ చేసింది.

Published on: Sep 14, 2026, 16:02:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన పిల్లలు నేర్చుకునేందుకు, ఆడుకునేందుకు, పాల్గొనేందుకు, తమ భావాలను వ్యక్తీకరించేందుకు డిజిటల్ ప్రపంచం అపూర్వమైన అవకాశాలను అందిస్తోంది. అదే సమయంలో సైబర్ బెదిరింపులు, ఆన్‌లైన్ గ్రూమింగ్, ఫొటోలు/వీడియోల ద్వారా దుర్వినియోగం, తప్పుడు సమాచారం, గోప్యత ఉల్లంఘనలు, డిజిటల్ లైంగిక వేధింపులు వంటి కొత్త ప్రమాదాలకు కూడా చిన్నారులను గురిచేస్తోంది.

టింగ్ టాంగ్ క్యాంపెయిన్
టింగ్ టాంగ్ క్యాంపెయిన్

ఈ నేపథ్యంలో CRY – చైల్డ్ రైట్స్ అండ్ యు (Child Rights and You) సంస్థ.. ‘ఆన్‌లైన్‌లో ఏదైనా చేసే ముందు కాస్త ఆగండి.. రెండుసార్లు ఆలోచించండి’ అంటూ 'టింగ్ టాంగ్' క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. పిల్లలు, పెద్దలు ఇలా ఆగి, ఆచితూచి స్పందించడాన్ని అలవరచుకోవడం ద్వారా సురక్షితమైన డిజిటల్ ప్రవర్తనను పెంపొందించడం ఈ క్యాంపెయిన్ లక్ష్యం.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాలను CRY విశ్లేషించినపుడు ఈ సమస్య తీవ్రత స్పష్టమవుతోంది. 2017 నుంచి 2024 మధ్య, దేశవ్యాప్తంగా పిల్లలపై సైబర్ నేరాలు 20 రెట్లు పెరిగాయి. 2017లో 88 కేసుల నుంచి 2024లో 1,753 కేసులకు చేరాయి. అందులో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM)కు సంబంధించిన నేరాలు ఏకంగా 157 రెట్లు పెరిగాయి. 2017లో కేవలం 7 కేసులుగా ఉన్నవి 2024లో 1,099 కేసులకు పెరిగిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా పిల్లలపై సైబర్ నేరాలు 2017లో కేవలం ఒక కేసుగా ఉండగా.. 2024లో 55 కేసులకు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈ కేటగిరీలో నమోదైన కేసుల సంఖ్యలో రాష్ట్రం 3 శాతం వాటాతో 11వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ సంఖ్య 2022లో 124 కేసులతో గరిష్ట స్థాయికి చేరి, తర్వాతి రెండేళ్లలో గణనీయంగా తగ్గింది.

ఈ కేసుల స్వరూపాన్ని పరిశీలిస్తే, ఆన్‌లైన్ లైంగిక దోపిడీ అనేది వీటిలో సింహ భాగంగా కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2024లో రాష్ట్రంలో నమోదైన 55 కేసుల్లో 38 కేసులు.. అంటే దాదాపు 70 శాతం CSAMకు సంబంధించినవే. వీటిని NCRB 'సైబర్ పోర్నోగ్రఫీ/ చిన్నారులతో కూడిన అశ్లీల లైంగిక చిత్రాలను పెట్టడం లేదా ప్రచురించడం' అనే నేర విభాగం కింద వర్గీకరించి గణిస్తోంది.

ఆన్‌లైన్‌లో చిన్నారులకు లైంగిక వేధింపుల ముప్పు తీవ్రత ఎంతగా ఉందనేది.. ఈ CSAM కేసుల శాతం తేటతెల్లం చేస్తోంది. జిల్లాల వారీగా చూసినపుడు నమోదైన CSAM కేసులు కొన్ని జిల్లాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నట్టు కనిపిస్తోంది. 2024లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తొమ్మిది కేసులు, ఆ తర్వాత కాకినాడలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన 38 CSAM కేసుల్లో 17 కేసులు – అంటే దాదాపు 45 శాతం కేసులు ఈ రెండు జిల్లాల్లో ఉన్నాయి. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగేసి కేసులు నమోదయ్యాయి.

“పిల్లల భద్రత, శ్రేయస్సు అనేదానిని వారి చుట్టూ భౌతిక ప్రదేశాల్లో జరిగే ఘటనలు మాత్రమే కాదు.. వారి చేతుల్లోని ఫోన్లు తదితర డిజిటల్ స్క్రీన్లపై జరిగే ఘటనలు కూడా ప్రభావితం చేయడం అధికమవుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అంతేకాదు.. తమనే తప్పుపడతారనే భయంతోనో, తమనే శిక్షిస్తారనే భయంతోనో చాలామంది పిల్లలు హానికరమైన ఆన్‌లైన్ అనుభవాలను బయటకు వెల్లడించకుండా మౌనంగా భరిస్తున్న ఉదంతాలూ ఉన్నాయి” అని CRY సౌత్ రీజినల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ చెప్పారు.

ఏపీలో సైబర్ భద్రతా చర్యలు

CSAM కేసులు ఎక్కువగా ఉండటం.., ఆన్‌లైన్‌లో ఇలాంటి చిత్రాల ప్రచురణను నివారించడం, వేగంగా గుర్తించడం, తొలగించడం, ఫిర్యాదు చేయడం అనేవి.. సైబర్ స్పేస్‌లో చిన్నారుల రక్షణకు చేపట్టాల్సిన అత్యంత ముఖ్యమైన చర్యలుగా చాటుతోంది. దీనితో పాటు.. డిజిటల్ బెదిరింపులు, సైబర్ స్పేస్‌లో వెంటబడడం, వేధించడం వంటి హాని నుంచి కూడా పిల్లలకు రక్షణ కల్పించడం కీలకం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా పటిష్ట చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై వయో పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. వయసు ధృవీకరణ కోసం డిజిలాకర్ (DigiLocker) 'ఏజ్ టోకెన్స్'ను వినియోగించే విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. అలాగే రాష్ట్ర పోలీసు విభాగం కూడా.. ఏపీ సైబర్ గార్డ్ (AP Cyber Guard) వ్యవస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రాకింగ్ టూల్స్, ప్రత్యేక బృందాలు, సైబర్ వార్ రూమ్‌లను మిళితం చేస్తుంది. మహిళలు, పిల్లల రక్షణ కోసం రాష్ట్రం రూపొందించిన శక్తి (SHAKTHI) భద్రతా వ్యవస్థ డిజిటల్ పర్యవేక్షణను అనుసంధానిస్తుంది, దీనికి జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 1930 సైబర్ హెల్ప్‌లైన్, 112 అత్యవసర సేవలను జోడిస్తోంది.

సైబర్ సవాళ్లకు సామూహిక పరిష్కారం

“సాంకేతికత ఆధారిత నిఘా, నియంత్రణలకు సంబంధించిన ఫిర్యాదు వ్యవస్థలు చిన్నారులకు పిల్లలకు అనుకూలంగా ఉండాలి. డిజిటల్ అక్షరాస్యత పెంపొందాలి. ఈ అంశంలో ఉపాధ్యాయులకు, కౌన్సెలర్లకు తగిన శిక్షణ ఇవ్వాలి. తల్లిదండ్రులతోను, పిల్లలతోను నిరంతరం అనుసంధానమై ఉండాలి. చిన్నారులపై సైబర్ నేరాలు కొనసాగుతుండడం.. నేరాలపై కఠిన చర్యలను చేపట్టడంతో పాటు ఈ నేరాలు జరగకుండా నిరోధిండం కూడా చాలా ముఖ్యమని చాటిచెప్తోంది. టెక్నాలజీ, సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యత వహించాలి.. వయసు ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పిల్లల భద్రతకు సంబంధించిన ఫిర్యాదు సాధనాలను సరళతరం చేయడం అందులో భాగంగా ఉండాలి. ఇందులో సమాజం పాత్ర కూడా చాలా ఉంది” అని జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు.

CRY టింగ్ టాంగ్ క్యాంపెయిన్

“ఈ తక్షణ అవసరాన్ని CRY గుర్తించింది. డిజిటల్ ప్రపంచాన్ని పిల్లలకు సురక్షితంగా మలచడం కోసం 'ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు రెండుసార్లు ఆలోచించండి' అనే థీమ్‌తో CRY దేశవ్యాప్తంగా 'టింగ్ టాంగ్' ప్రచారాన్ని ప్రారంభించింది. డిజిటల్ నోటిఫికేషన్ లేదా అలర్ట్ శబ్దం ‘టింగ్ టాంగ్’ను.. అంతర్గత హెచ్చరిక సంకేతంగా ఈ ప్రచారం ఉపయోగిస్తోంది: నమ్మే ముందు – టింగ్ టాంగ్. క్లిక్ చేసే ముందు – టింగ్ టాంగ్. షేర్ చేసే ముందు – టింగ్ టాంగ్” అని ఆయన వివరించారు.

క్యాంపెయిన్ ముఖ్యాంశాలు

పిల్లలు, తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయుల్లో అవగాహనను, డిజిటల్ సాధికారతను పెంపొందించడం.

సామాజికంగానూ, పాఠశాలలు కేంద్రంగానూ చేపట్టే చిన్నారుల రక్షణ కార్యక్రమాల్లో ఆన్‌లైన్ భద్రతను చేర్చడం.

ఆన్‌లైన్ ప్రపంచంలో సురక్షితంగా సంచరించేందుకు అవసరమైన జ్ఞానం, ఆత్మవిశ్వాసం పిల్లలకు అందించడం.

బహుళ వేదికలతో భాగస్వామ్యాల ద్వారా నిరంతర ప్రజా భాగస్వామ్యంతో ఈ చర్చను ముందుకు తీసుకెళ్లడం.

పాలనా, విధాన పరమైన చర్చల్లో చిన్నారుల ఆన్‌లైన్ భద్రతను తక్షణ ప్రాధాన్యత గల అంశంగా నిలబెట్టడం.

“భారతదేశ డిజిటల్ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ, ఈ సమష్టి ఉద్యమంలో భాగం కావాలని ప్రతి పౌరుడిని CRY ఆహ్వానిస్తోంది. తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, విద్యార్థులుగా, విధాన నిర్ణేతలుగా, సాంకేతిక నిపుణులుగా లేదా సమాజంలోని సభ్యులుగా – చిన్నారులకు భద్రదమైన సైబర్ వాతావరణాన్ని రూపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది.” అని జాన్ రాబర్ట్స్ చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More