తిరుమలలో మే నెలలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల లడ్డూల విక్రయం.. రోజుకు సగటున 4.08 లక్షలు తయారీ!

మే నెలలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల లడ్డూల విక్రయం జరిగింది. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలు తయారీ చేశారు.

Published on: Jun 3, 2026, 17:28:22 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది.

తిరుమల లడ్డూ
తిరుమల లడ్డూ

ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలు విక్రయమయ్యాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024 మే నెలలో 1.01 కోట్ల లడ్డూలు విక్రయమవ్వగా, 2025లో 1.10 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం 2026లో 1.21 కోట్లకు పైగా విక్రయాలు నమోదవడం విశేషం.

శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ, రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా, ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతోంది.

అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదమైన లడ్డూల తయారీ కోసం రోజువారీగా 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను టీటీడీ వినియోగిస్తోంది. లడ్డూ తయారీకి రోజుకు సుమారు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శెనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వినియోగిస్తున్నారు.

ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుండి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శెనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన “తిరుపతి లడ్డూ”కు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపును మంజూరు చేసింది. అదేవిధంగా లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలోపేతమైంది.

ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోటులో రెండు అత్యాధునిక ఏఐ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తున్నారు. అలాగే పోటు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకులను కొనుగోలు విభాగం సేకరించి, ప్రయోగశాల పరీక్షలు నిర్వహించిన అనంతరమే వినియోగానికి అనుమతిస్తోంది.

శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ “దిట్టం” ప్రమాణాలను నేటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్నప్రసాదాలు, 25 రకాల పణ్యారాలను సిద్ధం చేస్తున్నారు.

శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలూ సేవలందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు. లడ్డూ తయారీ ప్రక్రియలో భాగంగా బూంది పోటు, పడి పోటు, అదనపు పోటు, అంతర్గత పోటు వంటి ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి.

తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌లో 56 కౌంటర్ల ద్వారా మూడు షిఫ్టుల్లో 24 గంటలూ లడ్డూల విక్రయం, పంపిణీ జరుగుతోంది. అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పొందిన ప్రతి భక్తునికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఎలాంటి కొరత రాకుండా 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుతున్నారు. ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More