Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం (2026 అక్టోబరు 13) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై అధిరోహించి, ద్వారకా శ్రీకృష్ణుడి విశేష అలంకారంలో భక్తకోటికి దివ్యదర్శనమిచ్చారు.

సర్వాలంకార భూషితుడైన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసి మాడ వీధుల్లో వేచి ఉన్న వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వాహనసేవ ముందర గజాలు, అశ్వాలు రాజసంతో నడుస్తుండగా… భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాల సప్తస్వరాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మారుమోగాయి.
కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక - చిన్నశేష వాహనం
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పరమాత్మను 'శేషి'గా, ఈ సృష్టిలోని సర్వజీవరాశులను 'శేషభూతం'గా పరిగణిస్తారు. నాగరాజైన వాసుకిని ప్రతిబింబించే ఈ చిన్నశేష వాహనసేవ ద్వారా స్వామివారు శేషి భావాన్ని లోకానికి చాటిచెబుతున్నారు.
ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని… అలాగే యోగసాధకులకు కుండలినీ యోగసిద్ధి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
రాత్రి హంస వాహనసేవ….
మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానానికి ప్రతీక అయిన హంస వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. ఈ వాహనసేవ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణతో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.