ఈ-వీసాతో తిరుపతికి చేరేలా కేంద్రం గ్రీన్ సిగ్నల్.. విదేశీ ప్రయాణికులకు రిలీఫ్!

విదేశీ ప్రయాణికులకు భారత్ రాకను మరింత సులభతరం చేస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి సహా 11 నూతన కేంద్రాలకు ఈ వీసా ప్రవేశ పాయింట్లుగా నోటిఫై చేసింది.

Published on: Aug 11, 2026, 14:35:29 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విదేశీ భక్తులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత ఈ వీసా కలిగిన విదేశీయులు నేరుగా దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉన్న అధికారిక విమానాశ్రయాల జాబితాలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తిరుపతితో పాటు భోపాల్ విమానాశ్రయాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.

ఈ-వీసా లిస్టులో తిరుపతి
ఈ-వీసా లిస్టులో తిరుపతి

దీంతో దేశంలో ఈ-వీసా ద్వారా ప్రవేశించగల పోర్టుల సంఖ్య 88కి చేరింది. వీటిలో 37 విమానాశ్రయాలు, 38 ఓడరేవులు (సీపోర్టులు), 13 లాండ్ (సరిహద్దు) పోర్టులు ఉన్నాయి.

కేంద్రం నిర్ణయంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పందిస్తూ.. తిరుపతి విమానాశ్రయాన్ని విదేశీ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. అయితే ఇక్కడి నుంచి క్రమబద్ధమైన అంతర్జాతీయ విమానాలు నడవాలంటే విమానయాన సంస్థలు ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలతో సర్వీసులు ప్రారంభించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. అయితే ప్రారంభంలో వచ్చే నష్టాలను అధిగమించడానికి, సర్వీసులను కొనసాగించడానికి విమానయాన సంస్థలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సాయాన్ని కోరుతున్నాయని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం అనేకమంది విదేశీ భక్తులు వస్తుంటారు. ఇప్పటివరకు వీరు చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగి, అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా లేదా దేశీయ విమానాల ద్వారా తిరుపతికి చేరుకునేవారు.

నూతన నోటిఫికేషన్ ప్రకారం.. చెల్లుబాటు అయ్యే ఈ-వీసా ఉన్న విదేశీ ప్రయాణికులు ఇకపై తిరుపతి విమానాశ్రయాన్ని నేరుగా ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది అంతర్జాతీయ విమానాల అందుబాటుపై ఆధారపడి ఉంటుంది.

దేశంలోకి పర్యాటకులను ఆకర్షించేందుకు, వీసా ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత్ 2014లో 43 దేశాల పౌరులకు ఈ-వీసా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇది 172 దేశాలకు, 17 రకాల కేటగిరీలలో విస్తరించింది. విదేశీయులు దరఖాస్తు చేసుకునే ఈ-వీసాలలో దాదాపు 95 శాతం దరఖాస్తులు 72 గంటల్లోనే పూర్తవుతుండగా, భారతదేశం జారీ చేసే వీసాలలో 78 శాతం వరకు ఎలక్ట్రానిక్ వీసాలే కావడం గమనార్హం.

ఈ-వీసా అనుమతి లభించినప్పటికీ, తిరుపతి విమానాశ్రయం నుంచి క్రమబద్ధమైన అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఇంకా బాకీగానే ఉంది. 2008లోనే కేంద్ర క్యాబినెట్ తిరుపతికి అంతర్జాతీయ హోదాను మంజూరు చేయగా 2017లో గెజిట్ నోటిఫికేషన్ విడుదలలు అయ్యాయి. నోటిఫికేషన్ వచ్చి దాదాపు తొమ్మిది ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఒక్క షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానం కూడా ఇక్కడి నుంచి ప్రారంభం కాలేదు.

ద్వైపాక్షిక వైమానిక సేవా ఒప్పందాలు, మార్కెట్ డిమాండ్, సంబంధిత కంపెనీల సొంత విధానాల ప్రాతిపదికన మాత్రమే విమాన సంస్థలు అంతర్జాతీయ మార్గాలను ఎంచుకుంటాయని 2025 ఫిబ్రవరిలో పౌర విమానయాన శాఖ మంత్రి రాజ్యసభలో స్పష్టం చేశారు.

తిరుపతి విమానాశ్రయంలో డిసెంబర్ 2024లో సింగపూర్ నుండి ఒక అంతర్జాతీయ చార్టర్డ్ విమానం ల్యాండ్ అయినప్పటికీ, అది పూర్తిస్థాయి వాణిజ్య సర్వీసుగా మారలేదు. అయితే పెద్ద విమానాల రాకపోకలకు వీలుగా రన్‌వే పొడవును 2,286 మీటర్ల నుండి 3,810 మీటర్లకు పొడిగించడంతో పాటు మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచారు.

2024-25 సంవత్సరంలో ఈ విమానాశ్రయం దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. రాయలసీమ ప్రాంతం నుండి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More