AP Weather : బంగాళాఖాతంలో ద్రోణి.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. దీనితో నవంబర్ 25, 26వ తేదీల్లో ఏపీలో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Updated on: Nov 25, 2026, 17:55:02 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మన్నార్ గల్ఫ్ నుండి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(RTGS) సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఏపీలో వర్షాలు (Unsplash)
ఏపీలో వర్షాలు (Unsplash)

గురువారం(26-11-2026) పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లోను చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక మధ్యాహ్నాం 3 గంటల నాటికి తిరుపతి జిల్లా నాయుడుపేటలో 45.3మిమీ, నెల్లూరు జిల్లా అల్లంపాడులో 41.5మిమీ, గూడూరులో 32.7మిమీ, తిరుపతి జిల్లా వాకాడులో 32.5మిమీ, నెల్లూరు జిల్లా విడవలూరులో 32మిమీ, తిరుపతి జిల్లా పెన్నేపల్లెలో 30మిమీ, నెల్లూరు జిల్లా మొలకలపుండ్లలో 28 మి.మీ, నెల్లూరులో 23.2మిమీ, భీమవరంలో 22.7 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

మత్స్యకారుల కోసం గాలింపు

కాకినాడ జిల్లా ఉప్పాడ మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు ఈ నెల 19వ తేదీ సాయంత్రం జిల్లా యంత్రాంగానికి సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కోస్ట్‌గార్డ్ అధికారులకు తెలియజేసిందని కలెక్టర్ పేర్కొన్నారు.

కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు అందిన సమాచారం మేరకు గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 18వ తేదీన ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించినట్లు ప్రాథమికంగా గుర్తించారని తెలిపారు. ఆ తరువాత వారు ఫోన్ ద్వారా గానీ, ట్రాన్స్‌పాండర్ ద్వారా గానీ ఎలాంటి సమాచారం అందుబాటులోకి రాలేదని వివరించారు.

మత్స్యకారులు గల్లంతైనట్లు సమాచారం అందిన వెంటనే కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో ఒడిశా, చెన్నై కోస్ట్‌గార్డ్ కేంద్రాలకు సమాచారం అందించడంతోపాటు సంబంధిత విభాగాల మధ్య సమన్వయం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనేందుకు కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులు సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. యుద్ధ నౌకలు, హెలికాప్టర్లను వినియోగిస్తూ సముద్రంలో నిరంతరాయంగా గాలింపు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బంగ్లాదేశ్, మయన్మార్ నేవీ అధికారులతో కూడా పంచుకున్నట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించడంతోపాటు వారి చివరి కదలికలను గుర్తించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ వివరించారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా వివిధ నిఘా, సమాచార వ్యవస్థల ద్వారా వారి ఆచూకీని గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వస్తారనే ఆశాభావాన్ని జిల్లా కలెక్టర్ వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించే వరకు సంబంధిత అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలను కొనసాగించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.