పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు : పంచమీ తీర్థానికి టీటీడీ ‌ఏర్పాట్లు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన న‌వంబరు 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.

Published on: Nov 24, 2025, 11:01:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, ప‌ద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమ‌ణ గేట్లు, సూచిక బోర్డులు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు పూర్తయ్యాయి. తిరుచానూరుకు వచ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ భ‌ద్రత, నిఘా విభాగం ప‌టిష్టమైన భ‌ద్రతా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా టిటిడి భ‌ద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్‌.సి.సి.విద్యార్థులు 200, శ్రీ‌వారి సేవ‌కులు 900, పోలీస్ సిబ్బంది 1600 మందితో భ‌ద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

చంద్రప్రభ వాహనంపై అమ్మవారు (TTD)
చంద్రప్రభ వాహనంపై అమ్మవారు (TTD)

భ‌క్తుల సౌక‌ర్యార్థం దాదాపు 150 అన్నప్రసాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్ప గార్డన్స్‌లో 50, ఎస్వీ హైస్కూల్ వ‌ద్ద -15, శ్రీ అయ‌ప్పస్వామివారి (నవజీవన్ ఆసుపత్రి)ఆల‌యం వ‌ద్ద – 45, పూడి ఏరియాలో – 25., గేట్ – 4లో ఎమర్జెన్సీ – 15 అన్నప్రసాదం కౌంట‌ర్లలో పంపిణీ చేస్తారు. అదేవిధంగా క్యూలైన్లలోని భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన త్రాగునీరు, అల్పాహ‌రం, అన్నప్రసాదాలు, మ‌జ్జిగ‌ పంపిణీ చేస్తారు.

ఇందులో భాగంగా 284 శాశ్వత, తాత్కాలికం, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందుకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించారు. అమ్మవారి ద‌ర్శన స‌మ‌యం, అన్నప్రసాదాలు, మ‌రుగుదొడ్లు, పార్కింగ్ త‌దిత‌ర ప్రాంతాల‌ను భ‌క్తులు సుల‌భంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాల‌లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

వైద్య, పారా మెడిక‌ల్ సిబ్బంది, 3 ప్రాంతాల‌లో ప్రథ‌మ‌చికిత్స కేంద్రాలు, 5 అంబులెన్స్‌లు, అవ‌స‌ర‌మైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్‌, రుయా ఆసుప‌త్రుల‌కు చెందిన వైద్యులు, ఆయుర్వేద వైద్యులు భ‌క్తుల‌కు సేవ‌లందిస్తారు. అదేవిధంగా ఫైర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

చంద్రప్రభ వాహనంపై అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఉంటాయని భక్తుల నమ్మకం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More