తిరుమలలో ఏప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో టీటీడీ భక్తుల ల‌గేజీ డెలివరీ సేవ‌లు

తిరుమలలో ఏప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో టీటీడీ భక్తుల ల‌గేజీ డెలివరీ సేవ‌లు అందాయి. అర కోటి మందికి పైగా భ‌క్తుల‌కు ల‌గేజీ సురక్షంగా జమ – బట్వాడా జరిగింది. తిరుమలలో భక్తుల లగేజీ భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.

Published on: Jun 16, 2026, 20:32:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో లగేజీ డిపాజిట్ మరియు డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది. భక్తులు శ్రీవారి దర్శనం, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో, కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 65 కౌంటర్లు ఏర్పాటు చేసి 345 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తున్నారు.

టీటీడీ లగేజీ సేవలు
టీటీడీ లగేజీ సేవలు

టీటీడీ కల్పించిన ఈ సేవలను భక్తులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో రికార్డు స్థాయిలో 51,38,976 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని డిపాజిట్ చేసుకున్నారు. గ‌త ఏడాది ఏప్రిల్ లో 20,75,481 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో 23,15,279 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రత ప‌ర‌చుకున్నారు. గ‌త ఏడాది మే నెల‌లో 23,82,622 త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకోగా.. ఈ ఏడాది 28,23,697 మంది భ‌క్తులు త‌మ ల‌గేజీని భ‌ద్రప‌ర‌చుకున్నారు.

అంటే గ‌త ఏడాది ఏప్రిల్ నెల‌తో పోల్చితే 2,39,798 ల‌గేజీ డిపాజిట్లు, మే నెల‌తో పోల్చితే 4,41,075 ల‌గేజీ డిపాజిట్లు అత్యధికంగా న‌మోదు కావ‌డం విశేషం. అదేవిధంగా తిరుమలలో రద్దీ పెరిగిన నేపథ్యంలో గత మూడు రోజుల్లో 3,41,742 మంది ఉచిత లగేజీ సేవలు వినియోగించుకున్నారు.

అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలిపిరి కాలినడక మార్గం ల‌గేజీ కేంద్రంలో ‍5 కౌంటర్లు, 45 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది) ఉంటారు. 10,194 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం ఇక్కడ ఉంది.

శ్రీవారి మెట్టు ల‌గేజీ కేంద్రంలో 2 కౌంటర్లు ఉండగా.. 10 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 5 మంది)తో 3,025 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం ఇక్కడ ఉంది. ఈ కేంద్రాల్లో లగేజీ డిపాజిట్ చేసిన భక్తులు తిరుమలలోని డెలివరీ కేంద్రాల్లో సులభంగా తిరిగి పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.

తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల కోసం లగేజీ, సెల్ ఫోన్ డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఫ్రీ హాల్ – 8 కౌంటర్లు, 20 సిబ్బంది (17,291 సెల్ ఫోన్లు, 7,793 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)తో ఉన్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్– 2 కౌంటర్లు, 12 సిబ్బంది (4,270 సెల్ ఫోన్లు) ఉంటారు. నారాయణగిరి షెడ్ – 5 కౌంటర్లు, 45 సిబ్బంది (11,941 సెల్ ఫోన్లు, 6,749 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)తోపాటుగా మరికొన్ని కేంద్రాలు ఉన్నాయి. తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట సమీపంలో కూడా ప్రత్యేక కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది.

డిపాజిట్ చేసిన లగేజీని తిరిగి పొందేందుకు డెలివరీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అలిపిరి ఫుట్‌పాత్ డెలివరీ, శ్రీవారి మెట్టు డెలివరీతోపాటుగా మరికొన్ని కౌంటర్లు ఉన్నాయి.

టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రాల్లో భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేట్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తారు. ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి ఒక నిమిషంలోపు లగేజీని భక్తులకు అందిస్తారు.

తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వద్ద ఉన్న లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను అధికారిక డిపాజిట్ కేంద్రాల్లో భద్రపరచి, టోకెన్ ఆధారంగా తిరిగి పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. లక్షలాది మంది శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ అందిస్తున్న ఈ సేవలు పూర్తిగా ఉచితం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More