డిసెంబర్ 20 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో డిసెంబర్ 20 నుండి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. అయితే అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం కల్పించాలని టీడీడీ ఆలోచిస్తోంది.
డిసెంబర్ 20 నుండి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో గురువారం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించి అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంతో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలను కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు.
అధికమంది సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనాల్లో చేసిన విధంగానే తొలి మూడు రోజులకు ఆన్లైన్లో ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించాలని చెప్పారు. తర్వాతి ఏడు రోజులు సర్వ దర్శనం అమలు చేయాలని తెలిపారు. డిసెంబర్ 25వ తేది శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు దర్శన క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కలిగేలా పగడ్భందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ మనోహరం, డిప్యూటీ ఈవోలు భాస్కర్, రాజేంద్ర, శ్రీ వేంకటేశ్వర్లు, సోమన్నారాయణ, రమాకాంత్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, వేణుగోపాల్, వీజీవో సురేంద్ర, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శాస్త్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


