TTD : ఆదివాసీల నుంచి ఉత్పత్తులను సేకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం

TTD : ఏపీజీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులను సేకరించి ఆదివాసీలకు సహాయం చేయనుంది టీటీడీ. ప్రీమియం అరకు కాఫీ, తేనె, ఎండు మిరపకాయలు, కుంకుడుకాయల పొడి, జీడిపప్పులను సేకరించనుంది.

Updated on: Aug 5, 2026, 21:05:32 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అడవి తల్లి నమ్ముకుని జీవించే వేలాది ఆదివాసీ కుటుంబాలకు, అరకు లోయలోని కాఫీ రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (ఏపీ జీసీసీ) ద్వారా మరింత విస్తృతంగా ఉత్పత్తులను సేకరించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గిరిజను సేకరించే అటవీ ఉత్పత్తులకు నిలకడైన మార్కెట్ సౌకర్యం లభించడమే కాకుండా వారి ఆర్థిక పురోగతికి బాటలు పడనున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు నాయకత్వంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో జీసీసీ నుంచి వివిధ రకాల ఉత్పత్తుల సేకరణకు సంబంధించి కీలక ఆమోదం లభించింది.

అరకు లోయలోని గిరిజన రైతులు పండించే నాణ్యమైన అరేబికా కాఫీ గింజల నుంచి తయారైన 7,200 కిలోల ప్రీమియం ఇన్స్టంట్ కాఫీ పౌడర్‌ను టీటీడీ కొనుగోలు చేయనుంది. కిలో రూ. 1,414.35 చొప్పున మొత్తం రూ. 1.01 కోట్ల విలువైన ఆర్డర్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. గతంలో ఉన్న రూ. 617.40 ధరకు ఇది రెట్టింపు కంటే ఎక్కువే అయినప్పటికీ, ఇందులో ఎలాంటి రోబస్టా కాఫీ కలపకపోవడం, భౌగోళిక గుర్తింపు కలిగి ఉండటం, అత్యంత నాణ్యమైనది కావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

టీటీడీకి అవసరమైన 1.35 లక్షల కిలోల ఎండు మిరపకాయలను కిలో రూ. 219.45 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 274.60 కంటే ఇది 20 శాతం తక్కువ. దీనివల్ల టీటీడీకి భారీగా నిధులు ఆదా కానున్నాయి. ఇప్పటికే జీసీసీ నుంచి తీసుకుంటున్న 4,000 కిలోల తేనెను (కిలో రూ. 437.85), 1,000 కిలోల కుంకుడు కాయల పొడిని (కిలో రూ. 218.40) యథావిధిగా కొనుగోలు చేస్తారు.

జీసీసీ నిర్వహించిన టెండర్ ధరల ప్రకారం 75,000 కిలోల జీడిపప్పును సేకరిస్తారు. ఇందులో ఆలు జీడిపప్పు (Whole Cashew) కిలో రూ. 847.79 కాగా, బద్ద జీడిపప్పు (Split Cashew) కిలో రూ. 911గా నిర్ణయించారు. టీటీడీ వార్షిక అవసరం 11 లక్షల కిలోలు కాగా, మిగిలిన మొత్తాన్ని బహిరంగ టెండర్ల ద్వారా సేకరిస్తారు.

జీసీసీ ప్రతిపాదించిన కొన్ని ఉత్పత్తుల ధరలు ప్రస్తుతం టీటీడీ కొనుగోలు చేస్తున్న రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. పసుపు పొడి (40,000 కిలోలు) - ప్రస్తుతం రూ. 144 ఉండగా జీసీసీ రేటు రూ. 201.60. కారం పొడి (33,000 కిలోలు) - ప్రస్తుతం రూ. 239.75 ఉండగా జీసీసీ రేటు రూ. 257.25. కుంకుమ (24,000 కిలోలు) - ప్రస్తుతం రూ. 180 ఉండగా జీసీసీ రేటు రూ. 225.75.

ఈ ధరలను తగ్గించేందుకు జీసీసీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని టీటీడీ కొనుగోలు కమిటీ సూచించింది. అయితే గిరిజనుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వ సంస్థ కావడంతో, సంప్రదింపుల అనంతరం వీటి కొనుగోలును కూడా పరిశీలించవచ్చని తెలిపింది.

మొత్తంగా ఏడాదికి రూ. 12.97 కోట్ల విలువైన ఉత్పత్తులను జీసీసీ నుంచి కొనుగోలు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. బోర్డు ఆమోదానికి ముందే టీటీడీ ల్యాబొరేటరీలో ఈ ఉత్పత్తుల శాంపిల్స్‌ను పరీక్షించగా, అవి అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తేలింది. జీసీసీ కూడా తమ సొంత ల్యాబ్ నివేదికలను సమర్పించి నాణ్యతను ధృవీకరించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More