Vijayawada Airport Terminal : విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులకు బిగ్ అప్డేట్ - త్వరలోనే కొత్త టెర్మినల్ సేవలు!

Vijayawada Airport New Terminal : విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసి, హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో అంతర్జాతీయ సేవలను విస్తరించనున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు.

Published on: Sep 5, 2026, 14:09:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijayawada Airport New Terminal : రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే సరికొత్త రూపుదిద్దుకోనుంది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ అందుబాటులోకి వస్తే, విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు సెక్యూరిటీ, బ్యాగేజ్ చెకిన్ ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయి.

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌
విజయవాడ ఎయిర్‌పోర్ట్‌

ఇందుకు సంబంధించిన వివరాలను ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కొత్త టెర్మినల్ ద్వారా 'హబ్ అండ్ స్పోక్' మోడల్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొని ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులపై కీలక వివరాలు పంచుకున్నారు.

అక్టోబర్ నాటికి నిర్మాణం పూర్తి….

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జూన్ నెలలోనే కొత్త కాంట్రాక్టర్‌కు నిర్మాణ బాధ్యతలను అప్పగించిందని ఆయన తెలిపారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి టెర్మినల్ పనులు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయిన కొన్ని రోజుల్లోనే ప్రారంభోత్సవం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ అధునాతన టెర్మినల్‌లో మల్టీ లెవల్ ఆపరేషన్స్, ఆరు ఏరోబ్రిడ్జ్‌లు, ఎస్కలేటర్లు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండనున్నాయి.

విజయవాడ నగరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం రోజుకు 22 విమానాల రాకపోకలను నిర్వహిస్తోంది. నిత్యం దాదాపు 2,000 మంది ప్రయాణికులు ఈ సేవలని వినియోగించుకుంటున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ విమానాల విషయానికి వస్తే, సింగపూర్ మరియు షార్జాలకు వారానికి మూడు రోజులు సర్వీసులు నడుస్తున్నాయి.

భక్తుల సౌకర్యార్థం 'ఫ్లై91' సంస్థ త్వరలోనే విజయవాడ నుంచి తిరుపతికి ఉదయం పూట విమాన సర్వీసును ప్రారంభించబోతోందని డైరెక్టర్ వెల్లడించారు. అలాగే యూరప్, అమెరికా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి దుబాయ్‌కి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కార్గో సేవలు - భవిష్యత్తు ప్రణాళికలు….

ఎయిర్‌పోర్ట్‌లో సరుకుల రవాణా (కార్గో) కోసం సుదీర్ఘకాల ప్రణాళికలో భాగంగా ఒక ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ కార్గో టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. అప్పటివరకు, కొత్త టెర్మినల్ ప్రారంభమైన తర్వాత ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాత టెర్మినల్‌ను పూర్తిస్థాయి కార్గో టెర్మినల్‌గా మార్చి సేవలను విస్తరిస్తామని లక్ష్మీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదే కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్ ప్రెసిడెంట్ పి. భాస్కరరావు మాట్లాడుతూ… విజయవాడ నుంచి దుబాయ్‌కి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని, అలాగే ప్రముఖ అంతర్జాతీయ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా హబ్ అండ్ స్పోక్ కనెక్టివిటీని బలోపేతం చేయాలని కోరారు. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలకు ప్రయాణికులకు అనుకూలమైన వేళల్లో విమానాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు కుళ్ళిపోయే అవకాశం ఉన్న వ్యవసాయ, ప్యాకేజ్డ్ ఉత్పత్తుల రవాణా కోసం ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ కార్గో సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More