విజయవాడ రైల్వే డివిజన్ సరికొత్త ప్రయోగం - ‘పంక్చువాలిటీ యాప్’ ఆవిష్కరణ! దేశంలోనే తొలిసారి
Vijayawada Division Punctuality App : రైళ్ల సమయపాలనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దక్షిణ కోస్తా రైల్వేపరిధిలోని విజయవాడ డివిజన్ "Punctuality BZA" అనే సరికొత్త ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇలాంటి యాప్‌ను తీసుకురావడం ఇదే తొలిసారి.
Vijayawada Division Punctuality App : రైల్వే రవాణా వ్యవస్థలో సరికొత్త డిజిటల్ విప్లవానికి విజయవాడ రైల్వే డివిజన్ శ్రీకారం చుట్టింది. రైళ్లు నడిచే సమయాన్ని, వాటి ఆలస్యాన్ని నిజసమయంలో (Real-time) ట్రాక్ చేసేందుకు పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన "Punctuality BZA" అనే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను విజయవాడ డివిజన్ అధికారులు శనివారం ఆవిష్కరించారు. భారతీయ రైల్వేలోనే ఇటువంటి అంతర్గత సమయపాలన పర్యవేక్షణ యాప్‌ను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం అని అధికారులు వెల్లడించారు.

విజయవాడ డివిజన్ ఐటీ విభాగం పూర్తిగా అంతర్గతంగా ఈ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీంతో రైల్వే ఆపరేటింగ్ అధికారులు, కంట్రోలర్లు డెస్క్‌టాప్ కంప్యూటర్లపై ఆధారపడకుండా.. ఎక్కడి నుంచైనా తమ మొబైల్ ద్వారానే రైళ్ల కదలికలను సులువుగా పర్యవేక్షించవచ్చు. ఇప్పటివరకు వాడుకలో ఉన్న ఐసీఎంఎస్ (ICMS) వెబ్ పోర్టల్‌లో పదే పదే ఓటీపీ (OTP) నమోదు చేయాల్సి రావడం, బహుళ స్క్రీన్లను వెతకాల్సి రావడం వంటి సాంకేతిక ఇబ్బందులు ఉండేవి. వాటన్నింటికీ ఈ నూతన యాప్ స్వస్తి పలికింది.
ఈ అప్లికేషన్ అన్ని రకాల కీలక కార్యాచరణ సమాచారాన్ని ఒకే డ్యాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. ఇందులో సెక్షన్ల వారీగా రైళ్ల స్థితిగతులు, లేట్ ట్రైన్ మానిటరింగ్ (LTM), పంక్చువాలిటీ అసెస్‌మెంట్ మోడ్యూల్ (PAM) గణాంకాలతో పాటు ఏవైనా రైళ్లు 15 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తుంటే కంట్రోలర్లకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్లు వెళ్తాయి. ఈ రియల్-టైమ్ పర్యవేక్షణ సామర్థ్యం వల్ల అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని…. రైళ్లు సమయానికి నడిచేలా తగిన చర్యలు చేపట్టే వీలుంటుంది.
‘LTM BZA’ తో అనుసంధానం…..
ఈ కొత్త అప్లికేషన్‌ను విజయవాడ డివిజన్ కు చెందిన మరో అంతర్గత యాప్ అయిన "LTM BZA"తో అనుసంధానించారు. ఇది జీపీఎస్ (GPS) సాంకేతికత సహాయంతో ట్రైన్ మేనేజర్లకు (గార్డులకు) రైలు ప్రయాణ పత్రాల నమోదు ప్రక్రియను ఆటోమేట్ చేస్తుంది. రైలు రాక, పోక, వేగం మరియు ప్రయాణ వివరాలను ఇది స్వయంచాలకంగా రికార్డు చేస్తుంది.
ఒకవేళ ఎక్కడైనా రైలు నిలిచిపోతే దానికి గల కారణాన్ని ట్రైన్ మేనేజర్ ఈ యాప్‌లో నమోదు చేయగానే.. ఆ సమాచారం వెంటనే 'Punctuality BZA' డ్యాష్‌బోర్డ్‌లో ప్రత్యక్షమవుతుంది. దీంతో కంట్రోలర్లు ఆలస్యానికి గల కారణాలను తక్షణమే విశ్లేషించగలరు.
ఈ సాంకేతిక ఆవిష్కరణపై విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. "రైల్వే నిర్వహణలో డిజిటల్ ఆవిష్కరణలు సరికొత్త మార్పులు తెస్తున్నాయి. పంక్చువాలిటీ బీజెడ్ఏ, ఎల్‌టీఎం బీజెడ్ఏ యాప్‌ల రూపకల్పన.. సాంకేతికతను స్మార్ట్ ఆపరేషన్స్ కోసం వాడుకోవాలనే మా నిబద్ధతకు నిదర్శనం. ఇవి అధికారులకు క్షేత్రస్థాయి సమాచారాన్ని అందిస్తూ వేగవంతమైన నిర్ణయాలకు తోడ్పడతాయి. అదే సమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది భద్రత, ప్రయాణికుల సేవలపై మరింత శ్రద్ధ పెట్టేందుకు వీలు కల్పిస్తాయి. రైళ్ల సమయపాలనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు ఇది మరో ముందడుగు," అని చెప్పుకొచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

