Srisailam VIP Break Darshan Cancelled : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి దివ్యధామంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ అసాధారణ రద్దీని దృష్టిలో ఉంచుకుని…. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించేందుకు దేవస్థానం యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు…

శుక్రవారం (మే 29) నుంచి జూన్ ఒకటో తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నాలుగు రోజుల పాటు కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రముఖులకు మాత్రమే నిబంధనల ప్రకారం దర్శన సౌకర్యం ఉంటుంది. మిగిలిన సమయంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వేగంగా దర్శనాలు కల్పించనున్నారు.
వేసవి సెలవుల కారణంగా వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండకుండా…. వారికి త్వరగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
భక్తుల సౌకర్యార్థం ఈ కాలంలో మల్లికార్జునస్వామి వారి అలంకార దర్శనాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా దేవస్థానం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి దేవస్థాన సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.