శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం: శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారా? పూర్తి దర్శన సమాచారం, డ్రెస్ కోడ్ వివరాలు!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి అయిన శ్రీశైల క్షేత్ర దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆలయ సమయాలు, టికెట్ల ధరలు మరియు క్షేత్ర పురాణ విశేషాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎలా వెలిశారు?, స్థల పురాణం గురించి కూడా ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

Published on: May 26, 2026, 12:31:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కృష్ణానది తీరంలో ఈ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా పూజలు అందుకుంటారు. భ్రమరాంబిక అమ్మవారు పూజాభిషేకాలను అందుకుంటారు. పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, వారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాలు కనపడతాయి. త్రేతాయుగంలో రాముడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు స్థలపురాణం చెబుతోంది. అయితే చాలా మంది ప్రతి ఏటా ఈ ఆలయానికి వెళుతూ ఉంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన పూర్తి దర్శన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం: శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారా? పూర్తి దర్శన సమాచారం, డ్రెస్ కోడ్ వివరాలు! (pinterest)
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం: శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారా? పూర్తి దర్శన సమాచారం, డ్రెస్ కోడ్ వివరాలు! (pinterest)

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సమయాలు

ప్రతిరోజు రెండు విడతలుగా శ్రీశైలం ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అలాగే మళ్లీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 10:00 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు ఆలయ శుద్ధి చేయడానికి దర్శనాలను నిలిపివేస్తారు.

శ్రీశైలం ఆలయ దర్శనం టికెట్ల వివరాలు

సర్వదర్శనం

ఇది పూర్తిగా ఉచితం. ఎలాంటి మూల్యం చెల్లించక్కర్లేదు.

శీఘ్ర దర్శనం

ఒక్కొక్కరికి 150 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అతి శీఘ్ర దర్శనం

300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు. రద్దీని బట్టి ప్రత్యేక లైన్‌లో పంపిస్తారు.

స్పర్శ దర్శనం

ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గర్భాలయ ప్రవేశం ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి అత్యంత విశేషమైన దర్శనం ఇది. స్వయంగా స్వామివారిని తాకి పూజించుకునే అవకాశం ఉంటుంది. రద్దీని నియంత్రించడానికి దేవస్థానం వారు దీనిని కేటాయిస్తారు.

స్పర్శ దర్శనం స్లాట్ వివరాలు

ఉదయం 7:00 నుంచి ఉదయం 8:30 వరకు,

మధ్యాహ్నం 11:45 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు,

రాత్రి 9:00 నుంచి రాత్రి 11:00 వరకు.

(సమయాలు మారే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి)

డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా?

అవును. శ్రీశైలం స్వామివారిని దర్శించుకోవడానికి ఈ డ్రెస్ కోడ్‌ను పాటించాలి. స్పర్శ దర్శనానికి వెళ్లేవారు కచ్చితంగా పురుషులు అయితే పంచె లేదా ధోతి వేసుకోవాలి. మహిళలు చీర లేదా చున్నీతో ఉండే చుడిదార్ ధరించొచ్చు. సాధారణ రోజుల్లో మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని నిలిపివేస్తారు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎలా వెలిశారు?

వినాయకుడు, కుమారస్వామి ఇద్దరిలో ఎవరికి ముందు వివాహం జరిపించాలని చర్చించుకున్న పార్వతీ పరమేశ్వరులు ఒక పోటీ పెట్టారు. ముల్లోకాలను చుట్టి ఎవరైతే ముందు వస్తారో వాళ్లకే ముందు పెళ్లి చేస్తామని చెప్పారు. కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరారు. వినాయకుడు బుద్ధిచాతుర్యంతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి, తల్లిదండ్రులకంటే మించిన లోకాలు ఏమీ లేవని చెప్పడంతో పోటీలో వినాయకుడు నెగ్గాడు.

మనస్థాపానికి గురైన కుమారస్వామి

కుమారస్వామి తిరిగి వచ్చి తీవ్ర మనస్థాపానికి గురై, తల్లిదండ్రులపై అలిగి కైలాసాన్ని వదిలిపెట్టి క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడు. పుత్రుని వియోగం తట్టుకోలేక పార్వతీ పరమేశ్వరులు వెతుక్కుంటూ ఆ పర్వతం దగ్గరికి వచ్చారు. వారి రాక కుమారస్వామికి ఇష్టం లేదని గ్రహించి జ్యోతిర్లింగ రూపంలో పార్వతీ పరమేశ్వరులు వెలిశారు. పార్వతీదేవి మల్లికా సమేతంగా, శివుడు అర్జునుడిగా వెలిసినందుకుగాను “మల్లికార్జునుడు” అని పేరు వచ్చింది.

స్థల పురాణం

పూర్వం దక్ష ప్రజాపతి, అల్లుడైన శివుడిని అవమానించాలని బృహస్పతి యాగం చేస్తాడు. అందరినీ పిలుస్తాడు. కానీ కూతురు సతీదేవిని, అల్లుడు శివుడిని పిలవడు. అయినా కూడా శివుడు వారించినా, సతీదేవి పుట్టింటిపై మమకారంతో అక్కడికి వెళ్తుంది. అక్కడ తన తండ్రి శివుడిని నిందించడం భరించలేకపోయి సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది.

శివుడు ఇక ఆగ్రహంతో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి నిర్జీవ శరీరాన్ని తన భుజంపై వేసుకుని లోకాలన్నీ తిరుగుతూ ప్రళయతాండవం చేసాడు శివుడు. విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా, ఆ శరీర భాగాలు 51 ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా వెలిశాయి. ఇక అందులో 18 మహిమాన్వితమైనవిగా మహాశక్తి పీఠాలు ప్రసిద్ధి చెందాయి. సతీదేవి మెడ భాగం పడిన శ్రీశైలం కూడా మహాశక్తి పీఠంగా విరాజిల్లుతోంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More