విశాఖ : కైలాసగిరి, జూ పార్క్, కంబాలకొండ అనుసంధానంతో ఇంటిగ్రేటెడ్ ఎకో-టూరిజం ప్లాన్!

విశాఖపట్నం ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. కైలాసగిరి, ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని అనుసంధానిస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజం ప్లాన్‌పై ఆలోచనలు చేస్తోంది.

Published on: Jul 4, 2026, 11:22:20 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నం నగర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. విశాఖను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఒక సమగ్ర ఇంటిగ్రేటెడ్ ఎకో-టూరిజం డెవలప్‌మెంట్ ప్లాన్(Integrated Eco-Tourism Development Plan)ను విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ ప్రతిపాదించారు. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కైలాసగిరి, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (జూ పార్క్), కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

విశాఖ ఎకో టూరిజం
విశాఖ ఎకో టూరిజం

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలపై విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీ శ్రీభరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్, జిల్లా అటవీ అధికారి(DFO) రవీంద్ర ధామా, జూ క్యూరేటర్ మంగమ్మలతో పాటు అంతర్జాతీయ డిజైనింగ్ సంస్థలైన సింగపూర్‌కు చెందిన 'మాండై' (Mandai), బెంగళూరుకు చెందిన 'ఇంటిగ్రేటెడ్ డిజైన్' ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖపట్నం సహజసిద్ధమైన భౌగోళిక అందాలు, సముద్ర తీరం, కొండలతో పర్యావరణ పర్యాటకానికి ఎంతో అనుకూలమైనదని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నైట్ సఫారీని ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కైలాసగిరి, కంబాలకొండ వంటి ప్రకృతి రమణీయ ప్రాంతాలలో పర్యాటకులను అలరించేందుకు అదనపు సాహస క్రీడల వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు.

పర్యాటకుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన రోడ్లు, రవాణా, వ్యూ పాయింట్లు వంటి మౌలిక సదుపాయాలను అంచనా వేయాలన్నారు శ్రీభరత్. పర్యావరణ చట్టాలకు లోబడి, ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఉండాలని ఎంపీ స్పష్టం చేశారు.

అటవీ శాఖ, వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి దశగా స్థానిక ప్రజల, పర్యాటకుల అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని, దీనికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ త్వరలోనే సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే ఏపీ పర్యాటక రంగంలోనే విశాఖ సరికొత్త మైలురాయిగా నిలవనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More