హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్రం ఎన్ఓసీ ఇస్తే.. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మహానగరానికి అత్యంత ఆవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ చేపట్టడానికి వీలుగా, ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి అన్ని రకాల ఒప్పందాలు కుదిరినప్పటికీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు ఎందుకు విడుదల కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, సీతక్క, శ్రీహరి, పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

మెట్రో విస్తరణ ఎంతో అవసరం
ఎల్ అండ్ టీ నుంచి మెట్రో మొదటి దశ స్వాధీనం, నిధుల సమీకరణ, రెండో దశ విస్తరణ అంశాలపై సవివరంగా తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (NOC) ఇస్తే కేంద్రం వాటా లేకుండానే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఎల్ అండ్ టీ నుంచి మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో విస్తరణ చేపట్టాల్సి ఉందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మొదటి దశ స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు.
'మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి ఎల్ అండ్ టీకి రూ.13,500 కోట్ల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎఫ్‌సీతో అన్ని రకాల ఒప్పందాలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ గ్యారెంటీ కూడా ఇచ్చాం. ఐఆర్ఎఫ్‌సీ నుంచి ఈరోజు విడుదల కావలసిన నిధులు విడుదల కాలేదు. దీనికి కారణమేంటి?.' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మెట్రోను స్వాధీనం చేసుకునే విషయంలో చర్చోపచర్చల అనంతరం కుదిరిన ఒప్పందం మేరకు జపాన్ కు చెందిన ఆర్థిక సంస్థ ద్వారా నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్‌సీ ఖాతాలో బదిలీ అయ్యాయని సీఎం గుర్తుచేశారు. ఐఆర్ఎఫ్‌సీ ఖాతాలోకి నిధులు జమ అయినప్పటికీ, ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన నిధులు ఐఆర్ఎఫ్‌సీ నుంచి విడుదల కాలేదని చెప్పారు.
కారణాలు చెప్పి విస్తరించలేదు
హైదరాబాద్ అంతర్జాతీయ నగరమని చెప్పుకునే క్రమంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఆనాటి కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో మెట్రో మొదటి దశకు అంకురార్పణ జరిగిందన్నారు. ఆనాడు ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకుని అంతకన్నా అద్భుతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో 2009లో మెట్రో నిర్మాణానికి టెండర్లను పిలిచారని, ఆనాటి నుంచి 2020 నాటికి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ఫలక్ నుమా మార్గంలో నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. చారిత్రక కట్టడాలు ఉన్నాయని, ఇతరత్రా కారణాలను చూపి పూర్తి చేయలేదని అన్నారు.
9వ స్థానానికి పడిపోయాం
'మొదట్లో రూ. 15 వేల కోట్లతో ప్రారంభించిన మెట్రో పూర్తయ్యేనాటికి రూ. 22 వేల కోట్లకు చేరింది. ఆ తర్వాత గత ప్రభుత్వంలో పదేండ్ల పాటు మెట్రో విస్తరణపై ఆలోచన చేయలేదు. ఆరోజుల్లో దేశంలో ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో రెండో స్థానంలో ఉండింది. విస్తరణ చేయని కారణంగా ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో జనాభా 1.34 కోట్లకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో విస్తరణ తప్పక చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
2వ దశ విస్తరణ చేపట్టడానికి ఎల్ అండ్ టీని ఒప్పించి ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించిందని, అయితే ప్రతి ఏటా 350 – 400 కోట్ల రూపాయలు నష్టాలొస్తున్నాయని, ఆ నష్టాల కారణంగా 2వ దశ విస్తరణ చేపట్టలేమని ఎల్ అండ్ టీ తేల్చిచెప్పిందన్నారు ముఖ్యమంత్రి. ఈ దశలో మొదటి హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో విస్తరణ చేపట్టాలని మళ్లీ కేంద్రం సూచించిన నేపథ్యంలోనే ఆ దిశగా కార్యాచరణ పూర్తి చేశామని తెలిపారు.
నిధుల విడుదల ఆగిపోయింది
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఐఆర్ఎఫ్‌సీ, రైల్వే ప్రాజెక్టుల కోసం రుణాలను ఇస్తుందని చెబుతూ, మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి ఆ సంస్థతో రుణ ఒప్పందం చేసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకోసం ఫీజు రూపేణా సంస్థకు రూ. 84 కోట్లతో పాటు ఈక్విటీగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1400 కోట్లను కూడా చెల్లించామని తెలిపారు. రుణ ఒప్పందానికి సంబంధించి లావాదేవీలన్నీ పూర్తయ్యాయని చెబుతూ, ఐఆర్ఎఫ్‌సీతో తెలంగాణ ప్రభుత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం ప్రకారం నిధుల చెల్లింపు జరగాల్సి ఉండగా ఐఆర్ఎఫ్ సీ నుంచి నిధుల విడుదల ఆగిపోయిందని అన్నారు. అందుకు కారణం ఎవరని ప్రశ్నించారు.
తెలంగాణలో ఇలా ఎందుకు?
అన్ని రాష్ట్రాల్లో మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూర్చుతున్న నేపథ్యంలో తెలంగాణ విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందని అడిగారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో మొదటి విడతను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తే తప్ప 2వ విడత విస్తరణకు అవకాశం లేదని చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు 50 శాతం కేంద్రం భరిస్తున్నదని వాస్తవమైతే అందుకు సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


