Vizag School Boy Death : విశాఖలో విషాదం... క్లాస్ రూమ్ లో కుప్పకూలి ఆరేళ్ల విద్యార్థి మృతి, టీచర్ పై ఆరోపణలు
Vizag School Boy Death : విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ కొట్టడంతో ఆరేళ్ల విద్యార్థి స్పృహతప్పి పడిపోయి మరణించాడు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించారు.
Vizag School Boy Death : విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ఆరేళ్ల యుకేజీ విద్యార్థి అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయి మరణించాడు. గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం…. ఆ చిన్నారి తన హోమ్‌వర్క్ స్లేట్ పట్టుకుని టీచర్ టేబుల్ వద్ద వరుసలో నిలబడి ఉన్నాడు. హోమ్‌వర్క్ తనిఖీ చేస్తున్న సమయంలో బాధితుడు తీవ్ర భయాందోళనకు గురై ఏడుస్తూ కనిపిస్తున్నాడు. టీచర్ అతని యూనిఫామ్ పట్టుకుని సరిచేస్తుండగా ఆ బాలుడు చేతులు ఊపుతూ కనిపించాడు.

టీచర్ ముందు భయంగా వణికిపోయినట్లు ఉన్న బాలుడు…. క్షణకాలం నిశ్చేష్టంగా నిలబడినట్లు కనిపించగా…. ఒక్కసారిగా స్పృహతప్పి టీచర్ కాళ్లపై పడిపోయాడు. ఆ తర్వాత టీచర్ బాలుడిని తేరుకునేలా చేయడానికి ప్రయత్నించ. ఘటన గమనించిన పాఠశాల సిబ్బంది, ఇతరులు వెంటనే తరగతి గదికి చేరుకుని బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సరికి చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
టీచర్ కొట్టడం… దానివల్ల కలిగిన తీవ్ర భయాందోళన, ఒత్తిడి వల్లే తమ బిడ్డ గుండె ఆగిపోయి మరణించాడని బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "ఉపాధ్యాయుడు దాడి చేయడంతో తరగతి గదిలోనే బాలుడు పడిపోయాడు… ఆ తర్వాత మరణించాడు," అని ఒక పోలీస్ అధికారి పిటిఐ (PTI) వార్తా సంస్థకు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి
ఆరేళ్ల చిన్నారి మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారాన్ని… దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై అలాగే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులకు తన సానుభూతిని తెలిపిన లోకేష్… వారు ధైర్యంగా ఉండాలని కోరారు. సంభవించిన లోటును ఎవరూ భర్తీ చేయలేరని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎక్స్ (X) వేదికగా హామీ ఇచ్చారు.
త్రిసభ్య కమిటీ విచారణ
ఈ ఘటనపై పాఠశాల విద్యాశాఖ స్పందిస్తూ.. ఇది అత్యంత దురదృష్టకరమని, ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపింది. ఘటన జరిగిన వెంటనే విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి ప్రాథమిక నివేదికను అందజేశారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా వాస్తవాలను సమగ్రంగా పరిశీలించడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విశాఖపట్నం రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD), జిల్లా విద్యాశాఖాధికారి (DEO), రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులతో సున్నితంగా, బాధ్యతాయుతంగా, మానవీయ కోణంలో ప్రవర్తించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు బిఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

