...
...
Next Story

వాయిస్ మెసేజెస్ పెట్టినా ఫిర్యాదులుగా స్వీకరించాలి : సీఎం చంద్రబాబు

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. మనమిత్ర ద్వారా ఫిర్యాదుల స్వీకరణ చేయనున్నట్టుగా ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Published on: Jun 29, 2026, 16:13:41 IST
Advertisement

ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు సేవల్ని సులభతర ప్రక్రియను మొదలు పెట్టామని.. ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదిస్తున్నామని అధికారులు తెలిపారు.

సీఎం చంద్రబాబు రివ్యూ
సీఎం చంద్రబాబు రివ్యూ

అలాగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మనమిత్ర వాట్సాప్‌లో కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలన్నారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో సుమారు 3 వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని.. మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలన్నారు.

ఈ మేరకు నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు చంద్రబాబు. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, వారి మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేసినట్టు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారితో పాటు ఇళ్లకు కూడా వెళ్లి స్క్రీనింగ్ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు. స్క్రీనింగ్‌తో పాటు ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులను వెంటపెట్టుకుని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రానికి వచ్చారు. ఆర్టీజీఎస్ పనితీరును ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ సీఐఐ ప్రతినిధులకు వివరించారు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలను పరిపాలనలో ఏ విధంగా వినియోగిస్తున్నామనే అంశాన్ని భాస్కర్ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్టీజీఎస్ పనివిధానానికి సంబంధించిన కేస్‌స్టడీస్‌ను సీఐఐ ప్రతినిధులకు వివరించారు. సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks