శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈనెల 27వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 26వ తేదీన అంకురార్పణ చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది.
టీటీడీ ఏర్పాట్లు…

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం, కళ్యాణ వేదికల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ.... గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కల్యాణం రోజున వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించేందుకు చక్కటి ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని విభాగాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని కల్యాణం రోజున భక్తులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాలని, అవసరమైన చోట్ల చలువపందిళ్లు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఊరేగింపు నిర్వహించే వాహనాలు, రథానికి సంబంధించిన పటిష్టతను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నారు. .
అత్యవసర వైద్య పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య అధికారులకు సూచించారు. సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. కల్యాణం రోజున భక్తుల రవాణా, వసతి, పార్కింగ్ కల్పించేందుకు ఆర్‌టిసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండి కడప జిల్లాలోని ఆయా విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
- ఇక స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయనున్నారు.
- భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేస్తారు.
- టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
- బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్.ఈ.డి స్క్రీన్ లు ఏర్పాటు చేయనున్నారు.
- హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనము ఏర్పాటు చేయనున్నారు.