వెదర్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో చలి చంపేస్తోంది. బయటకు వెళ్లాలంటే వణుకు పుడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.

Published on: Nov 18, 2025, 18:09:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అసాధారణ వాతావరణ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. చలి వాతావరణం, వర్షాలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తూ భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ముఖ్యంగా తెలంగాణలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కంటే తక్కువగా ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయని నివేదికలు ఉన్నాయి. చలిగాలులు వీస్తున్నందున సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ సహా పలు ప్రాంతాలను ఎల్లో అలర్ట్‌లో ఉంచారు. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ తగ్గవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

ఆసిఫాబాద్, సంగారెడ్డి, కొమురంభీం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హనుమకొండ, వరంగల్‌లో 12 డిగ్రీల స్వల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

రాబోయే రోజుల్లో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్‌తో సహా అనేక జిల్లాలపై చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అల్లూరి జిల్లాలోని మినుములూరులో అత్యల్ప ఉష్ణోగ్రత 6 డిగ్రీల వద్ద నమోదైంది. అరకులో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, దట్టమైన పొగమంచు పరిస్థితుల మధ్య పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శీతాకాలం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటం ఈ ప్రాంత నివాసితుల ఆరోగ్యం, భద్రత గురించి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సైతం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఐఎండీ హెచ్చరించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More