అమవాస్య పూజల సాకుతో భర్తను గుడికి పిలిచి.. ప్రియుడితో కలిసి దారుణ హత్య!
చిత్తూరు జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ఇదంతా చిన్నారి కుమార్తె ముందే జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర ఘటన వెలుగుచూసింది. అమవాస్య పర్వదినం పూజల సాకుతో, నిండు నూరేళ్లు తోడుంటానని ప్రమాణం చేసిన భార్యే కాలయముడిగా మారింది. కళ్లారా చూసినా చిన్నారి కూతురి ముందే ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే ఈ గుట్టు విప్పారు.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా శూలగిరి ప్రాంతానికి చెందిన రమేష్ (23) హోసూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఇతనికి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బోయనపల్లి గ్రామానికి చెందిన హాసిని (19)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక చిన్నారి కూతురు ఉంది. వీరి సంసారం సాఫీగానే సాగుతోందని బంధువులు భావించారు. కానీ హాసిని పెళ్లికి ముందే తన బాల్య స్నేహితుడైన యుగంధర్ (20)తో ఉన్న ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి తర్వాత కూడా కొనసాగించింది. భర్త రమేష్ తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని వదిలించుకోవాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు.
పథకంలో భాగంగా.. మంగళవారం అమవాస్య పూజల కోసం గుడుపల్లె మండలంలోని మల్లప్ప కొండపై ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్దామని రమేష్‌ను హాసిని ఒప్పించింది. భార్య మాటలు నమ్మిన రమేష్ భార్యాపిల్లలతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. దారిపొడవునా హాసిని తన ఫోన్ ద్వారా భర్తకు తెలియకుండా తమ లైవ్ లొకేషన్‌ను ప్రియుడు యుగంధర్‌కు షేర్ చేస్తూనే ఉంది.
మల్లప్ప కొండ ఘాట్ రోడ్డుపై మూడో హెయిర్‌పిన్ బెండ్ వద్దకు రాగానే హాసిని తన చేతిలోని బ్యాగ్‌ను కింద పడేసింది. అది చూసి రమేష్ బైక్ ఆపాడు. పథకం ప్రకారం అక్కడే పొదల్లో మాటువేసిన యుగంధర్, అతని ముఠా సభ్యులు ఒక్కసారిగా రమేష్‌పై దాడికి దిగారు. భయంతో రమేష్ దాదాపు 100 మీటర్ల దూరం అడవిలోకి పరిగెత్తినా వదలకుండా వెంటాడి, పదునైన ఆయుధాలతో నరికి చంపారు. ఈ దారుణమంతా అమాయకపు చిన్నారి కళ్ల ముందే జరిగిపోవడం తీవ్ర కలకలం రేపింది.
సమయం దాటిపోతున్నా కూతురు, మనవరాలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన హాసిని తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ మార్గంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.
కొండపైకి వెళ్లేటప్పుడు రమేష్ బైక్‌పై భార్యాపిల్లలతో వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. కానీ తిరుగు ప్రయాణంలో హాసిని మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి రమేష్ మోటార్ సైకిల్‌పై వెళ్లడం సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ ఆధారాలతో పాటు మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ విశ్లేషణ ద్వారా పోలీసులు రమేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించి భార్య హాసిని, ఆమె ప్రియుడు యుగంధర్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హాసిని మైనర్‌గా ఉన్నప్పుడే రమేష్‌తో వివాహం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. ఒకవేళ విచారణలో హాసినికి మైనర్‌గా ఉన్నప్పుడే పెళ్లయినట్లు రుజువైతే, ఈ కేసులో బాల్య వివాహ నిరోధక చట్టం కింద అదనపు సెక్షన్లు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


