ఆంధ్రప్రదేశ్‌లో జులై నెల వర్షపాతం ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఐఎండీ అంచనా!
ఈసారి ఎల్‌నినో ప్రభావం భారతదేశం మీద స్పష్టంగా కనిపించనుంది. అయితే జులై నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉన్నాయి? వాతావరణం అంచనా ఇక్కడ తెలుసుకోండి.
జులై నెలలో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే సూచనలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వర్షపాత అంచనాల ప్రకారం.. రాయలసీమ, తీరప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది.

దేశంలోని చాలా ప్రాంతాల మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ నెలలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఉష్ణోగ్రతల్లో ఎంతమేర వ్యత్యాసం ఉంటుందనే దానిపై వాతావరణ నిపుణులు ఇంకా స్పష్టమైన అంచనాను వెల్లడించలేదు.
'కొన్ని రోజులు సాధారణం కంటే ఎక్కువ వేడిగానూ, మరికొన్ని రోజులు సాధారణం కంటే చల్లగానూ ఉండే అవకాశం ఉంది. కానీ ఉష్ణోగ్రతలు నిరంతరం అధికంగా ఉండవు. ప్రస్తుతం ఉష్ణోగ్రతల అంశం నుండి వర్షపాతం వైపు మళ్లాయి.' అని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింత ప్రభావవంతంగా ఉండే ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో కూడిన వర్షపాత సరళిపై నిపుణులు ఇప్పుడు దృష్టి సారించారు.
వాతావరణ నిపుణులు ముందుగా అంచనా వేసినట్లుగానే జూన్ నెలలో రాష్ట్రంలో సాధారణ స్థాయికి దగ్గరగా వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం జూన్ 1 నుండి 30 మధ్య అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అన్నమయ్య, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షపాతం లోపం కనిపించింది. మిగిలిన జిల్లాల్లో ఈ కాలంలో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదైంది.
తేలికపాటి జల్లులు కురిసిన విశాఖపట్నం జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. జూలై 3 వరకు రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. జూలై 4 నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


