...
...
Next Story

AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై జగన్ కసరత్తు - బలమైన అభ్యర్థుల ఎంపికే లక్ష్యంగా వ్యూహాలు..!

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. పార్టీ సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు.

Published on: Oct 14, 2026, 05:12:18 IST
Advertisement

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో అభ్యర్థుల ఎంపిక మరియు ఎన్నికల సన్నద్ధతపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. స్వయంగా పార్టీ అధినేత వైెఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగటమే కాదు… పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

ఇందులో భాగంగా మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు ఈ సమావేశాలు వరుసగా సాగాయి.

ఈ ముఖాముఖి చర్చల్లో పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లు పాల్గొన్నారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించిన జగన్….. ఎన్నికల వ్యూహాలపై నాయకులకు కీలక మార్గదర్శనం చేశారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు సంబంధించి వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

వ్యూహాలకు పదను…

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు 'రెడ్‌ బుక్ పాలన' పేరిట జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు. "గత రెండున్నరేళ్లుగా సాగుతున్న దుర్మార్గ పాలన, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అత్యంత బలమైన, ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలి, అని జగన్ పార్టీ నాయకులకు సూచించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని ఆదేశించారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అరాచకాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు నిలదీయాలని జగన్ నాయకులకు నిర్దేశించారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, లీగల్ టీమ్‌ను సంపూర్ణంగా అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కోర్టుల ద్వారా వెంటనే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

పార్టీ కార్యకర్తలపై బైండోవర్ల పేరిట జరుగుతున్న పోలీసు వేధింపులపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. చట్టాన్ని ధిక్కరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవనే స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలి," అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ పట్ల అత్యంత విశ్వసనీయత, విధేయత కలిగిన వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks