విశాఖలో రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకున్నారు - సీఎం చంద్రబాబుపై YS జగన్ ఫైర్

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో  దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Published on: Jan 31, 2026, 18:06:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు లాగేసుకున్నారని విమర్శించారు. ఏపీలో ప్రభుత్వ పాలనను చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

ప్రభుత్వ భూములను లాగేసుకున్నారు - వైఎస్ జగన్

“హలో ఇండియా… ఇది ఒక వేక్-అప్ కాల్. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు , ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుంది. రుషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా బహిరంగంగానే కబ్జా చేసేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్‌కు కట్టబెట్టేశారు” అని వైెఎస్ జగన్ ఆరోపించారు.

“వైయస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో తిరిగి స్వాధీనం చేసుకుని…. ఫెన్సింగ్ వేసిన భూములను ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన కుటుంబానికి ఉచితంగా బహుమానంగా ఇచ్చేశారు. ఈ విలువైన భూములను లోకేష్ తన తోడల్లుడికి కట్టబెట్టడం, చంద్రబాబు కుటుంబ కుట్రను బయటపెడుతోంది. లోకేష్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యాశాఖ నుంచి ఒక మెమో జారీ చేసి ఈ భూములను తన తోడల్లుడికి కేటాయించేలా చేశారు.ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లు, బెదిరింపులతో నగర పాలక సంస్థ సభ్యుల (గ్రేటర్‌ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ మెంబర్స్)ను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారు" అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే, వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా బయటకు తోసేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో పలువురు వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లు గాయపడగా, పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు.

“ఈ భూ దోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు, బీసీ యాదవ వర్గానికి చెందిన వైయస్సార్‌సీపీ మహిళా మేయర్‌ను తొలగించారు, కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి రూ.5,000 కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి. వారి కుటుంబ ఆస్తులు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పరిపాటిగా జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు ప్రభుత్వ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు” అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More