ఈ ఒక్క డ్యాన్స్ వీడియోతో విడాకుల పుకార్లకు చెక్ పెట్టిన సీనియర్ నటి.. కలిసి కూర్చోకపోతే విడాకులు ఇచ్చినట్లు కాదంటూ..
బాలీవుడ్ సీనియర్ నటి షెఫాలీ షా తన భర్తతో కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసి విడాకుల పుకార్లకు చెక్ పెట్టింది. కలిసి కూర్చోకపోతే విడాకులు తీసుకుంటున్నట్లు కాదు అని ఓ స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇచ్చింది.
ప్రముఖ నటి షెఫాలీ షా, నిర్మాత-దర్శకుడు విపుల్ షా వైవాహిక జీవితం విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. సిల్వర్ జూబ్లీ యానివర్సరీ సందర్భంగా షెఫాలీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో, దానికి జత చేసిన ఒక నోట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమిళ సినిమా 'ఎనిమీ'లోని పాపులర్ సాంగ్ 'టమ్ టమ్' పాటకు ఈ జంట ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

విమానంలో వేర్వేరు సీట్లు.. ఎందుకంటే?
షెఫాలీ షా ఈ వీడియోతో తన విడాకుల పుకార్లకు కూడా తెరదించే ప్రయత్నం చేసింది. అసలు ఈ పుకార్లకు కారణమైన ఘటన గురించి కూడా వివరణ ఇచ్చింది. పెళ్లి రోజు వేడుకల కోసం వెళ్తున్నప్పుడు విమానంలో జరిగిన ఒక సంఘటనను షెఫాలీ తన పోస్టులో ప్రస్తావించింది.
"25 ఏళ్ల ప్రయాణం. విమానంలో ఇద్దరు పక్కపక్కన కూర్చునే సీట్లు ఉన్నా.. నేను వేరే సీటు ఎంచుకున్నాను. ఎందుకంటే నాకు విండో సీటు ఇష్టం, ఆయనకు కాళ్లు ఫ్రీగా ఉండటానికి ఐల్ (Aisle) సీటు ఇష్టం. విమానంలో మాకు కావాల్సినట్లు పక్కపక్క సీట్లు దొరకలేదు. అందుకే వేర్వేరుగా కూర్చున్నాం. దీనివల్ల ఇద్దరికీ కంఫర్ట్ దొరికింది" అని షెఫాలీ చెప్పింది.
స్పేస్ అంటే దూరం కాదు..
దాంపత్యంలో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన స్పేస్ గురించి షెఫాలీ చాలా లోతైన వ్యాఖ్యలు చేసింది.
"కొంచెం సర్దుకుపోవచ్చు కదా అని కొందరు అనొచ్చు. కానీ మన ఇష్టాన్ని చంపుకోవడం మంచి పెళ్లికి నిదర్శనం కాదు. చేతికి చేయి ఆనించుకుని కూర్చున్నంత మాత్రాన ప్రేమ ఉన్నట్లు కాదు. మేము పక్కపక్కన కూర్చోనంత మాత్రాన మేము విడాకులు తీసుకుంటున్నట్లు కాదు. ఎందుకంటే స్పేస్ ఇవ్వడం అంటే దూరం పెట్టడం కాదు. కలిసుండటం అంటే ఊపిరి ఆడనంతగా బంధించి ఉంచడం కాదు. బంధం అంటే కట్టిపడేయడం కాదు. కేవలం ఒకరే రాజీ పడటం సహచర్యం అనిపించుకోదు" అని ఆమె స్పష్టంగా చెప్పింది.
25 ఏళ్ల డ్యాన్స్
తమ ప్రయాణాన్ని ఒక డ్యాన్స్‌తో పోలుస్తూ.. "మా పెళ్లి కూడా అందరిలాగే ఎత్తుపల్లాలు, కష్టసుఖాలతో సాగింది. గడిచిన 25 ఏళ్లుగా మేము కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. కొన్నిసార్లు ఒకే తాళంలో, కొన్నిసార్లు భిన్నంగా. ఒక్కోసారి ఒకరి కాలిపై మరొకరు కాలు వేసి తడబడ్డాం. కానీ నవ్వుకుంటూనే ఒకరినొకరం మళ్లీ లేచి నిల్చున్నాం" అని ఎమోషనల్ అయింది. తమ ఇద్దరు కొడుకులు (ఆర్యమాన్, మౌర్య) తమకు ఫెవికాల్ బాండ్ లాంటివారని ఆమె పేర్కొనడం విశేషం.
షెఫాలీ షా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'ఢిల్లీ క్రైమ్ సీజన్ 3' (Delhi Crime Season 3)లో డీసీపీ వర్తికా చతుర్వేదిగా మరోసారి మెప్పించింది. రసిక దుగల్, హుమా ఖురేషి ఇందులో కీలక పాత్రలు పోషించారు.














