మీరు మనుషులు కాదు రాక్షసులు.. మానవాళికి ఇది అవమానం: ఎముకలు విరగకుండా భార్యలను కొట్టొచ్చన్న చట్టంపై నటి కామెంట్స్
తాలిబన్లు తీసుకొచ్చిన కొత్త చట్టంపై నటి స్వర భాస్కర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. భార్యలను ఎముకలు విరగకుండా, గాయం బయటకు కనిపించకుండా కొట్టొచ్చన్న ఈ చట్టం మానవాళికే అవమానం అని ఆమె అభిప్రాయపడింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ పీనల్ కోడ్ పై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ చట్టాలు పూర్తిగా అమానవీయంగా, అనాగరికంగా ఉన్నాయని ఆమె దుయ్యబట్టింది. భార్యను భర్త కొట్టడాన్ని సమర్థిస్తూ.. మహిళల హక్కులను కాలరాసేలా ఉన్న ఈ కొత్త చట్టాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుండగా.. స్వర భాస్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాలిబాన్ల తీరును ఖండించింది.

"వాళ్లు మనుషులు కాదు.. క్రూరమైన రాక్షసులు"
మహిళలపై తాలిబాన్ల అణచివేతకు అద్దం పట్టేలా ఆఫ్ఘనిస్థాన్‌లో అమలులోకి వచ్చిన కొత్త చట్టం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. తాలిబాన్లను "మానవ జాతికే మచ్చ" అని అభివర్ణించింది. ఈ వివాదాస్పద చట్టాలకు సంబంధించిన మీడియా కథనాలను శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఆమె.. అందులోని నిబంధనలపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొత్త చట్టాలపై స్వర భాస్కర్ స్పందిస్తూ.. "ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. నిజం చెప్పాలంటే తాలిబాన్లు మానవ జాతిలో పుట్టిన అత్యంత చెత్త వ్యక్తులు. వారు ఏమాత్రం కనికరం లేని క్రూరులు, రాక్షసులు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతున్న మతానికి, అలాగే మానవాళికి కూడా వీరు ఒక అవమానం. వీరి చర్యలు అత్యంత నీచమైనవి" అని తీవ్ర పదజాలంతో విమర్శించింది.
గృహహింసపై తాలిబాన్ల కొత్త చట్టం
తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సంతకంతో కూడిన 90 పేజీల కొత్త క్రిమినల్ కోడ్‌ను ఇటీవల అధికారికంగా అమలులోకి తెచ్చారు. 'ది ఇండిపెండెంట్' పత్రిక రిపోర్టు ప్రకారం.. ఈ కొత్త శిక్షాస్మృతి గృహహింసను చాలా వరకు సమర్థిస్తోంది. కొన్ని షరతులతో భర్త తన భార్యను కొట్టడానికి ఇది అనుమతి ఇస్తోంది.
ఒకవేళ భర్త కర్రతో కొట్టి, భార్యకు తీవ్ర గాయాలైతే మాత్రమే ఆ భర్తకు శిక్ష పడుతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. తాను తీవ్రంగా గాయపడ్డానని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా బాధితురాలైన మహిళపైనే ఉంటుంది. నేరం నిరూపితమైనా కూడా భర్తకు పడే గరిష్ట శిక్ష కేవలం 15 రోజుల జైలు మాత్రమే.
అదే సమయంలో భర్త అనుమతి లేకుండా భార్య ఇల్లు వదిలి వెళితే, లేదా భర్త తిరిగి రమ్మని అడిగినప్పుడు నిరాకరిస్తే, ఆ మహిళకు ఏకంగా మూడు నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ఇల్లు వదిలి వచ్చిన ఆ మహిళకు ఎవరైనా బంధువులు ఆశ్రయం ఇస్తే.. వారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు. ఇది మహిళల స్వయంప్రతిపత్తిని, వారికి ఉన్న చట్టపరమైన రక్షణను పూర్తిగా అణచివేసే చర్య అని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


