నీకు ఇంత చెత్త మూవీ నచ్చింది కానీ.. ధురంధర్ నచ్చలేదా: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ప్యాన్స్
బాలీవుడ్ మూవీ 'ఓ రోమియో' (O'Romeo)పై స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన పాజిటివ్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది. గతంలో 'ధురంధర్' (Dhurandhar) సినిమాలోని రాజకీయాలను విమర్శించిన హృతిక్.. ఇప్పుడు ఈ సినిమాను పొగడటంపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి, నానా పటేకర్, అవినాష్ తివారీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'ఓ రోమియో'. ఇటీవల విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూసిన బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. కానీ ఈ రివ్యూ అతన్ని దారుణమైన ట్రోలింగ్ బారిన పడేసింది. ఎందుకో చూడండి.

హృతిక్ రోషన్ రివ్యూలో ఏముంది?
సోషల్ మీడియాలో 'ఓ రోమియో' సినిమాను ప్రశంసిస్తూ హృతిక్ ఒక పోస్ట్ పెట్టాడు. "ఈ సినిమాలో ఉన్న విభిన్నమైన అంశాలు మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. నేను ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశాను. షాహిద్ కపూర్.. ఇలాంటి జానర్ సినిమాలు చేయడంలో నువ్వే బెస్ట్. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. గయ్స్ అందరూ వెళ్లి థియేటర్లలో ఈ సినిమాను చూడండి. అలాగే రన్నింగ్ ఇన్ సర్కిల్స్ యాక్షన్ సీక్వెన్స్ బ్రిలియంట్‌గా ఉంది" అని హృతిక్ రాసుకొచ్చాడు.
నెటిజన్ల ట్రోలింగ్.. 'ధురంధర్' లింక్
హృతిక్ పెట్టిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. 2025లో రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) పై హృతిక్ చేసిన కామెంట్సే.
ఒక నెటిజన్ స్పందిస్తూ.. "కేవలం పెయిడ్ ప్రమోషన్ కోసమే మీరు ఈ సినిమాను పొగడట్లేదని ఆశిస్తున్నాను. అద్భుతంగా తెరకెక్కిన 'ధురంధర్' సినిమాను మీరు ద్వేషించారు. కానీ ఈ చెత్త సినిమా మీకు నచ్చిందా?" అని ప్రశ్నించారు.
మరొకరు స్పందిస్తూ.. "సార్, ఈ సినిమాలో మీకు ఎలాంటి రాజకీయాలు కనిపించలేదా? లేదా అవి గుర్తించలేనంత సున్నితంగా ఉన్నాయా? నాడు 'ధురంధర్' సినిమాలో చూసినట్లుగా ఇందులో మీకు ఎలాంటి రాజకీయం కనబడలేదా?" అంటూ చురకలు అంటించారు.
అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం.. ఇద్దరు టాలెంటెడ్ నటులు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం మంచి పరిణామం అని, నెగెటివిటీని పక్కనపెట్టి సినిమాను చూడాలని హృతిక్‌కు మద్దతు తెలుపుతున్నారు.
'ధురంధర్'పై హృతిక్ ఏమన్నాడంటే?
గతేడాది ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్'. ఈ సినిమా చూసిన హృతిక్ రోషన్.. దర్శకుడి మేకింగ్‌ను, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనను ప్రశంసించారు. దీనిని 'అబ్సల్యూట్ సినిమా' అని పిలిచారు. కానీ ఈ సినిమాలో చూపించిన రాజకీయ భావజాలంతో తాను ఏకీభవించనని బహిరంగంగానే చెప్పారు.
"ఒక ప్రపంచ పౌరుడిగా, సినీ నిర్మాతలుగా మనం వహించాల్సిన బాధ్యతలపై నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందులోని రాజకీయాలతో నేను విభేదిస్తున్నాను" అని హృతిక్ అప్పట్లో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
'ఓ రోమియో' సినిమా విశేషాలు
ఈ సినిమా 1990ల నాటి ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' (Mafia Queens of Mumbai) పుస్తకం ఆధారంగా దీనిని రూపొందించారు. తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకునే 'అఫ్షాన్' (తృప్తి దిమ్రి) అనే వితంతువుకు, ఉస్తారా (షాహిద్ కపూర్) అనే గ్యాంగ్‌స్టర్ కమ్ పోలీస్ ఇన్‌ఫార్మర్‌కు మధ్య జరిగే హింసాత్మక, విషాదకరమైన ప్రేమకథే ఈ 'ఓ రోమియో' మూవీ.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


