శ్రీతేజ్‌కు మరింత సాయం చేసిన అల్లు అర్జున్.. దిల్ రాజుతో కలిసి చిన్నారి తండ్రి వీడియో.. మరో ఆరు నెలలు చికిత్స
సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు చిన్నారి శ్రీతేజ్‌కు మరింత సాయం చేయడానికి అల్లు అర్జున్ ముందుకు వచ్చినట్లు దిల్ రాజు వెల్లడించాడు. ఆ బాబు తండ్రి భాస్కర్ తో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశాడు.
'పుష్ప 2' సినిమా ప్రీమియర్ సందడిలో జరిగిన విషాద ఘటనకు ఏడాది పూర్తయిన వేళ.. బాధితుడి కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. అల్లు అర్జున్ టీమ్ స్పందించడం లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేరుగా రంగంలోకి దిగాడు. భాస్కర్‌ను కలిసి పరిస్థితిని చక్కదిద్దాడు.

దిల్ రాజు భేటీ.. లెక్కలన్నీ బయటపెట్టిన టీమ్
గురువారం (డిసెంబర్ 4) నాడు దిల్ రాజు, శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం అల్లు అర్జున్ టీమ్ మీడియాతో ఒక వీడియోను పంచుకుంది. ఇందులో ఇప్పటివరకు బాధిత కుటుంబానికి అందిన సాయం వివరాలను స్పష్టంగా వెల్లడించారు.
అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఇప్పటికే మొత్తం రూ. 3.20 కోట్లు సాయం అందించారని టీమ్ తెలిపింది. ఇందులో రూ. 1.5 కోట్లు శ్రీతేజ్ పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. "అల్లు అర్జున్ ఇచ్చిన రూ. 2 కోట్లను మేము డిపాజిట్ చేశాం. దానిపై వచ్చే వడ్డీ ద్వారా ఆ కుటుంబానికి ప్రతి నెలా రూ. 75,000 అందుతున్నాయి. వారి జీవన వ్యయాలు, వైద్య ఖర్చుల కోసం ఈ ఏర్పాటు చేశాం" అని దిల్ రాజు వివరించాడు.
బాబు వైద్యం కోసం, భవిష్యత్తు కోసం అదనంగా రూ. 70 లక్షలు కూడా చెల్లించినట్లు తెలిపారు. "శ్రీతేజ్ కోలుకుంటున్నాడు, కానీ అదనపు సాయం కావాలి" అని భాస్కర్ కోరడంతో, తాను వెంటనే అల్లు అరవింద్ తో మాట్లాడి సాయం చేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చాడు.
శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఏమన్నారంటే?
అల్లు అర్జున్ టీమ్ స్పందించడం లేదని ఆరోపించిన భాస్కర్.. దిల్ రాజుతో భేటీ తర్వాత ఆందోళన వీడారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ కుటుంబం తమకు అండగానే ఉందని, అయితే ఇప్పుడు బాబు రీహాబిలిటేషన్ కోసం మరింత సాయం అవసరమైందని చెప్పారు.
"నాకు కావాల్సిన అదనపు సాయం గురించి గత వారం దిల్ రాజు గారికి వివరించాను. నా బిడ్డ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల రీహాబిలిటేషన్ అవసరం. దానికి అల్లు అర్జున్ గారు ఒప్పుకున్నారు. మొత్తం వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని మాటిచ్చారు" అని భాస్కర్ తెలిపారు. దీనికి దిల్ రాజు స్పందిస్తూ, "ఆరు నెలలు కాదు.. సంవత్సరం పట్టినా సరే, మేం మీకు అండగా ఉంటాం" అని భరోసా ఇచ్చారు.
గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు కాగా అతడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


