అల్లు అర్జున్ ఆ చిన్నారి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదా.. బన్నీ వాస్ ఏం చెప్పాడో చూడండి

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన చిన్నారి శ్రీతేజ్ పరిస్థితిపై తాజాగా బన్నీ వాస్ స్పందించాడు. అతని కుటుంబాన్ని అతడు పట్టించుకోవడం లేదన్న విమర్శలపైనా మాట్లాడాడు.

Published on: Dec 4, 2025, 16:01:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనకు నేటితో (డిసెంబర్ 4) సరిగ్గా ఏడాది. అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి పాలయ్యాడు. రూ. 2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఏడాది గడిచినా తాము ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నామని శ్రీతేజ్ తండ్రి కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనిపై తాజాగా బన్నీ వాస్ స్పందించాడు.

అల్లు అర్జున్ ఆ చిన్నారి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదా.. బన్నీ వాస్ ఏం చెప్పాడో చూడండి (PTI)
అల్లు అర్జున్ ఆ చిన్నారి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదా.. బన్నీ వాస్ ఏం చెప్పాడో చూడండి (PTI)

అల్లు అర్జున్ టీమ్, బన్నీ వాసు ఏమంటున్నారు?

ఈ ఆరోపణలపై 'హిందుస్థాన్ టైమ్స్' అల్లు అర్జున్ ప్రతినిధిని సంప్రదించగా, గురువారం (డిసెంబర్ 4) జరిగిన ఒక ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు మీడియాకు చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నామని తెలిపాడు. శ్రీతేజ్ కుటుంబం అభ్యర్థనను అల్లు అర్జున్ పట్టించుకోవడం లేదన్న వార్తలపై బన్నీ వాసు స్పందించాడు. తన నెక్ట్స్ మూవీ ఈషా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడాడు.

"దయచేసి.. ఇది మాట్లాడాల్సిన వేదిక కాదు. మాకు, వారికి మధ్య చాలా మంది పెద్దమనుషులు ఉన్నారు. మేము ఏం చేసినా దిల్ రాజు గారి ద్వారానే చేస్తున్నాం. అల్లు అర్జున్‌కు వారితో నేరుగా సంబంధం లేదు" అని చెప్పాడు.

"మేము వారిని సంతృప్తి పరచామా లేదా అనేది పక్కన పెడితే.. మేము కొన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నాం. నిధులను వైద్య అవసరాలకు, ఇతర ఖర్చులకు ఎలా కేటాయించాలనే దానిపై ఒక పద్ధతి ఉంది. ఒకవేళ వారికి డబ్బు సరిపోకపోయినా, అసంతృప్తిగా ఉన్నా.. వారు మధ్యలో ఉన్న పెద్దమనుషులతో మాట్లాడొచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే సరిచేస్తాం. ఇది నేరుగా జరిగే వ్యవహారం కాదు" అని బన్నీ వాసు వివరణ ఇచ్చాడు.

శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?

ఆ దురదృష్టకరమైన రోజున తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్, నెలల తరబడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడాడు. కిమ్స్ ఆసుపత్రిలో 146 రోజుల సుదీర్ఘ చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినప్పటికీ.. మెరుగైన సంరక్షణ కోసం న్యూరో-రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.

ఏడాది గడిచినా బాబు పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ విషయమై శ్రీతేజ్ తండ్రి మాగుడంపల్లి భాస్కర్ 'ఏబీఎన్'తో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లడించారు. "శ్రీతేజ్ సొంతంగా తినలేడు, తాగలేడు, సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేడు. బాబు, పాప, వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మ.. వీళ్లందరినీ చూసుకోవడం నా ఒక్కడి వల్ల కావడం లేదు" అని ఆయన వాపోయారు.

కొడుకును చూసుకోవడం కోసం భాస్కర్ బంగారు దుకాణంలో పని మానేయాల్సి వచ్చింది. బాబు వైద్యానికి నెలకు రూ. 90,000, ఇతర అవసరాలకు కలిపి మొత్తం నెలకు రూ. 1.25 లక్షలు ఖర్చవుతోందని తెలిపారు.

అల్లు అర్జున్ కుటుంబం రూ. 2 కోట్లు డిపాజిట్ చేసిన మాట వాస్తవమేనని భాస్కర్ ధృవీకరించారు. అయితే ఆ డబ్బుపై వచ్చే వడ్డీ పెరుగుతున్న ఖర్చులకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీతేజ్ రీహాబిలిటేషన్ బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చినా, ఇప్పుడు టీమ్ నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఈ ఒక్క ఏడాదే బాబు కాళ్ల ఆపరేషన్లకు రూ. 3 లక్షలు ఖర్చు చేశామని చెప్పారు.

అసలేం జరిగింది?

డిసెంబర్ 4, 2024న జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి డిసెంబర్ 13న కోర్టులో హాజరుపరిచారు. అదే రోజు తెలంగాణ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తికాకపోవడంతో అతడు ఒక రాత్రి పోలీసుల అదుపులో ఉండాల్సి వచ్చింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ బాధితురాలి కుటుంబానికి రూ. 2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడు. ఇందులో అల్లు అర్జున్ రూ. 1 కోటి, మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని అందజేయడానికి తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు మధ్యవర్తిగా వ్యవహరించాడు. బాధితుడి వైద్య ఖర్చులను భరిస్తామని అప్పట్లో నటుడు హామీ ఇచ్చారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More