Allu Aravind: పుష్ప 2 తొక్కిసలాట బాధితుడి ఇంటికి అల్లు అరవింద్, స్నేహా రెడ్డి.. అండగా ఉంటామని హామీ.. వీడియో వైరల్
Allu Aravind: హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పరామర్శించారు. చిన్నారి సాన్వి చదువు బాధ్యతలను తాను తీసుకుంటానని నిర్మాత అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు.
Allu Aravind: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‘సంధ్య’ థియేటర్ వద్ద ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షో సమయంలో జరిగిన విషాద ఘటన మరువలేనిది. 2024 డిసెంబర్‌లో జరిగిన ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై నెలల తరబడి ప్రాణాపాయ స్థితిలో పోరాడారు.

ఈ కేసులో అప్పట్లో అరెస్ట్ అయ్యి బెయిల్‌పై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటను నిలబెట్టుకుంటూ తాజాగా అల్లు కుటుంబ సభ్యులు బాధితులను కలుసుకున్నారు.
బాధితులకు భరోసా ఇచ్చిన అల్లు అరవింద్, స్నేహారెడ్డి
బుధవారం (మే 6) అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి.. రేవతి కుటుంబాన్ని వారి నివాసంలో సందర్శించారు. రేవతి భర్త భాస్కర్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రేవతి కుమార్తె సాన్వితో అల్లు అరవింద్ ప్రత్యేకంగా ముచ్చటించారు.
"నువ్వు బాగా చదువుకుంటావా? తప్పకుండా చదువుకోవాలి. నీ చదువుకు అయ్యే ఖర్చులన్నీ నేనే భరిస్తాను" అని అల్లు అరవింద్ ఆ చిన్నారికి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోలుకుంటున్న శ్రీతేజ్.. అందని సాయం?
ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ సుమారు ఐదు నెలల పాటు వెెంటిలేటర్ పైనే ఉన్నాడు. ఏప్రిల్ 2025లో డిశ్చార్జ్ అయినప్పటికీ.. అతనికి ఇంకా దీర్ఘకాలిక వైద్య చికిత్స అవసరమవుతోంది. అయితే గతేడాది డిసెంబర్‌లో భాస్కర్ మీడియా ముందుకు వచ్చి తనకు ప్రభుత్వం, చిత్ర యూనిట్ నుంచి రావాల్సిన రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందలేదని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) చైర్మన్ దిల్ రాజు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారమైందని ప్రకటించారు. అల్లు కుటుంబం నేరుగా ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలేం జరిగింది?
డిసెంబర్ 4, 2024న 'పుష్ప 2' ప్రీమియర్ కోసం అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి సంధ్య థియేటర్‌కు వచ్చారు. ఆయన్ని చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో రేవతి మృతి చెందగా, పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 13న బన్నీ అరెస్టవ్వగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజే విడుదలయ్యారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం 'రాకా' (Raaka) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్,సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో బన్నీ సినిమాలు చేయనున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సంధ్య థియేటర్ ఘటన ఎప్పుడు జరిగింది?
డిసెంబర్ 4, 2024న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో అల్లు అర్జున్‌ను చూడటానికి అభిమానులు ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.
2. అల్లు అరవింద్ బాధితులకు ఎలాంటి హామీ ఇచ్చారు?
మృతురాలు రేవతి కుమార్తె సాన్వి విద్య కోసం అయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు.
3. బాధితుడు శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఏప్రిల్ 2025లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు, అయితే ఇంకా మెడికల్ కేర్ అవసరమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
4. అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు?
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయిక.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


