ప్రైమ్ వీడియోలోకి ఈరోజు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దల్దల్ (Daldal) ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ రివ్యూను ఇక్కడ చూడండి. ఎవరు చేశారనే దానికంటే ఎందుకు చేశారన్న పాయింట్ తో ఆసక్తిగా సాగే వెబ్ సిరీస్ ఇది.
క్రైమ్ థ్రిల్లర్ల మూవీస్, వెబ్ సిరీస్ లలో సాధారణంగా "హంతకుడు ఎవరు?" అనే ఉత్కంఠ చివరి వరకు ఉంటుంది. కానీ సురేష్ త్రివేణి రూపొందించిన ‘దల్దల్’ వెబ్ సిరీస్‌లో రెండో ఎపిసోడ్‌లోనే కిల్లర్ ఎవరో, హత్యలు ఎలా చేస్తున్నారో చూపించేస్తారు. అయినా సరే ఈ సిరీస్ ఆసక్తిని కోల్పోదు. ఇది హంతకుడు ఎవరనే దానికంటే, సాధారణ మనుషులు హంతకులుగా ఎందుకు మారారనే కోణంలో సాగే కథ. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

దల్దల్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?
కొత్తగా నియమితులైన డీసీపీ రీటా ఫెరీరా (భూమి పెడ్నేకర్) ఒక సీరియల్ కిల్లర్ కేసును ఛేదించాల్సి వస్తుంది. హంతకుడు బాధితుల మణికట్టు కోసి చంపుతుంటాడు. రీటా తన వ్యక్తిగత జీవితంలోని చేదు జ్ఞాపకాలతో, వ్యసనాలతో పోరాడుతూనే ఈ కేసును డీల్ చేస్తుంది.
మరోవైపు అనిత (సమారా తిజోరి), సాజిద్ (ఆదిత్య రావల్) అనే జంట తమకు అన్యాయం చేశారని భావించేవారిని శిక్షిస్తుంటారు. అనిత గతం కూడా రీటా గతానికి దగ్గరగా ఉంటుంది. వీరిద్దరి ప్రయాణం, వాళ్లు ఎంచుకున్న మార్గాలు వారిని ఎలా మార్చాయన్నదే ఈ వెబ్ సిరీస్ కథ.
దల్దల్ వెబ్ సిరీస్‌లో ఏం బాగుందంటే?
ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ప్రధానంగా నిలబెట్టింది ముగ్గురు ప్రధాన నటులే. భూమి పెడ్నేకర్ కోపంతో ఊగిపోయే పోలీస్ అధికారిగా కాకుండా, మానసిక సంఘర్షణ అనుభవించే పాత్రలో ఒదిగిపోయింది. కిల్లర్‌గా ఆదిత్య రావల్ తన నటనతో ఆకట్టుకున్నాడు.
అయితే అందరికంటే ఎక్కువగా ఆకట్టుకునేది సమారా తిజోరి. ఒక సైకో కిల్లర్‌గా ఆమె నటన అద్భుతం. అతిగా అరవడం, గట్టిగా డైలాగులు చెప్పడం కాకుండా.. కేవలం తన కళ్ళతోనే లోపల ఉన్న తన ఆగ్రహాన్ని చూపించింది.
రీటా, అనిత పాత్రలను ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలుగా చూపించడం బాగుంది. ఇద్దరి గతం ఒకేలా ఉన్నా.. వారికి దొరికిన ప్రేమ, వారు పెరిగిన పరిస్థితులు వారిని ఎలా భిన్నంగా మార్చాయో బాగా చూపించారు.
దల్దల్ మైనస్ పాయింట్లు
క్రైమ్ థ్రిల్లర్లకు ప్రధానంగా థ్రిల్ అనేది చాలా ముఖ్యం. కానీ ఇందులో అదే మిస్సయింది. హంతకుల మానసిక స్థితిని, నేరాలకు గల కారణాలను విశ్లేషించే క్రమంలో.. అసలైన మర్డర్ మిస్టరీ థ్రిల్‌ను పక్కన పెట్టేశారు. కొన్ని చోట్ల కథనం దారి తప్పినట్లు అనిపిస్తుంది. సిరీస్ మొత్తం మరీ సీరియస్‌గా, బాధాకరంగా ఉండటం కొందరికి నచ్చకపోవచ్చు.
కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అద్భుతమైన క్లైమాక్స్ ఈ వెబ్ సిరీస్‌ను కాపాడింది. ఇది పర్ఫెక్ట్ షో కాకపోయినా ఈ ఏడాది హిందీ ఓటీటీలో వచ్చిన ఒక మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వీకెండ్ చూసేయొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


