Anand Deverakonda: ఈ సినిమా సక్సెస్ వాళ్లకు చెంపదెబ్బ: రణబాలిపై ఆనంద్ దేవరకొండ సంచలన పోస్ట్ వైరల్
Anand Deverakonda: 'కాఫీ విత్ కరణ్ 9' షో తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలపై సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివిటీపై హీరో ఆనంద్ దేవరకొండ ఘాటుగా స్పందించారు. వాళ్ల పెళ్లి, వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తున్న వారికి 'రణబాలి' సాధించిన బాక్సాఫీస్ విజయం చెంపపెట్టు అని ఆనంద్ అనడం గమనార్హం.
Anand Deverakonda: టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali). అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది. అయితే ఇటీవల ప్రసిద్ధ బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9'లో ఈ జంట పాల్గొన్న తర్వాత నెట్టింట కొంతమంది ఉద్దేశపూర్వకంగా వీరిపై నెగెటివిటీ ప్రచారం చేయడం ప్రారంభించారు.

విజయ్, రష్మిక ఇద్దరూ ఇప్పటికే తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ట్రోలర్ల నోళ్లు మూయించగా.. తాజాగా విజయ్ సోదరుడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా తన అన్న, వదినలకు మద్దతుగా పోస్ట్ చేశారు.
నెగెటివిటీ మూతిపళ్లు రాలాయి: ఆనంద్ దేవరకొండ పోస్ట్
ఆనంద్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా విజయ్, రష్మిక పెట్టిన పోస్టులను రీషేర్ చేయడంతో పాటు, 'సౌత్ క్యాసెట్' అనే మీడియా పేజీ షేర్ చేసిన ఒక పవర్‌ఫుల్ పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు.
ఆ పోస్ట్‌లో.. “రణబాలి మూవీ తన బాక్సాఫీస్ విజయంతో సోషల్ మీడియాలోని నెగెటివిటీ మూతిపళ్లు రాలేలా గట్టి కౌంటర్ ఇచ్చింది. కేవలం బాక్సాఫీస్ నంబర్లు మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుంచి ఎంతో విలువైన గౌరవాన్ని దక్కించుకుని ప్రాఫిటబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది” అని పేర్కొన్నారు. తన అన్నయ్య, వదినల కష్టానికి దక్కిన విజయమిదని ఆనంద్ పరోక్షంగా స్పష్టం చేశారు.
రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల నిజాలివే
కొంతమంది ఈ సినిమాపై అసత్య ప్రచారాలు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' సక్సెస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ ట్రేడ్ పోర్టల్ గణాంకాల ప్రకారం.. ఈ సినిమా ఇండియాలో నెట్ వసూళ్లు రూ. 54.25 కోట్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 75.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా బిజినెస్ గురించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. "ఒకటి రెండు ప్రాంతాలు మినహా ఇండియా, ఓవర్సీస్‌లో దాదాపు అన్ని చోట్లా రణబాలి మూవీ బ్రేక్ ఈవెన్ (Breakeven) పూర్తి చేసుకుంది. మెజారిటీ ప్రాంతాల్లో లాభాల్లోకి వచ్చినప్పుడు దీనిని కచ్చితంగా సూపర్ హిట్ రణబాలి అని పిలవాలి" అని స్పష్టం చేశారు. థియేట్రికల్ రన్‌కు ముందే ఈ సినిమా భారీ ఓటీటీ, శాటిలైట్ డీల్స్ దక్కించుకోవడంతో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి.
19వ శతాబ్దపు బ్రిటిష్ కరువు నేపథ్యం
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన 'రణబాలి' చిత్రంలో విజయ్ దేవరకొండ రణబాలిగా, రష్మిక జయమ్మగా కనిపించారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతిభావంతమైన విలన్ పాత్రను పోషించారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన వల్ల వచ్చిన దారుణమైన కరువు నేపథ్యంలో, తమ ప్రజల ఆకలి చావులను అరికట్టడానికి ఆంగ్లేయులపై తిరగబడే వీరుడి కథగా ఈ చిత్రం తెరకెక్కింది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' పోటీగా బరిలోకి దిగినప్పటికీ, రణబాలి తన సత్తా చాటుకుని స్థిరమైన వసూళ్లను సాధించడం విశేషం. ఇక ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే, ఇటీవల 'బేబీ' కో-స్టార్ వైష్ణవి చైతన్యతో 'ఎపిక్' చిత్రంలో నటించి మెప్పించిన ఆయన, ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'డ్యూయెట్' (Duet) పనిలో బిజీగా ఉన్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


