...
...
Next Story

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్.. యాషెస్ ఐదో టెస్టే చివరిదని ప్రకటన

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొన్నేళ్లుగా కంగారూలకు టెస్టుల్లో నమ్మదిగిన ఓపెనర్‌గా ఉన్న అతడు.. యాషెస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరగబోయే ఐదో టెస్టే చివరిదని స్పష్టం చేశాడు.

Published on: Jan 2, 2026, 15:04:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో సిడ్నీ వేదికగా జరగనున్న ఐదో యాషెస్ టెస్టు తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని శుక్రవారం (జనవరి 2) ప్రకటించాడు. 39 ఏళ్ల ఖవాజా తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్.. యాషెస్ ఐదో టెస్టే చివరిదని ప్రకటన (AP)
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్.. యాషెస్ ఐదో టెస్టే చివరిదని ప్రకటన (AP)

ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్‌లో కీలక పాత్ర పోషించిన ఎడమచేతి వాటం బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగే మ్యాచ్‌తో తాను జెర్సీని వదిలేస్తున్నట్లు తెలిపాడు.

రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ ఖవాజా ఎమోషనల్ అయ్యాడు. "సిడ్నీ టెస్టు తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను. క్రికెట్ ద్వారా దేవుడు నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను, ఆటను మించిన స్నేహాలను ఇచ్చాడు. నా కెరీర్ ఏ ఒక్కరిదో కాదు.. ముఖ్యంగా మా తల్లిదండ్రులు చేసిన త్యాగాలే నన్ను ఇక్కడి దాకా తెచ్చాయి" అని ఖవాజా పేర్కొన్నాడు.

సిడ్నీలో ఒక చిన్న టూ-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ.. ఏదో ఒకరోజు టెస్ట్ క్రికెటర్ అవుతానని కలలు కన్నానని, అది నిజమైందని అతడు గుర్తుచేసుకున్నాడు.

ఖవాజా కెరీర్ హైలైట్స్, రికార్డులు

ఉస్మాన్ ఖవాజా 2011లో సిడ్నీ వేదికగానే ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అదే గ్రౌండ్‌లో రిటైర్ అవుతుండటం విశేషం. 35 ఏళ్ల వయసులో (2022లో) జట్టులోకి పునరాగమనం చేసి, సిడ్నీ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాది తన సత్తా చాటాడు.

ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-1 ఆధిక్యంలో ఉంది. ఇటీవల వెన్నునొప్పి కారణంగా ఖవాజా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు సిడ్నీలో జరిగే చివరి టెస్టుతో (తన 88వ టెస్టు) అతడు ఘనంగా వీడ్కోలు పలకనున్నాడు. వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. నాలుగో టెస్టులో గెలిచి పరువు నిలుపుకున్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks