అఖండ 2 చూడటానికి 475 కి.మీ. ప్రయాణం చేసిన ఫ్యాన్స్.. వాయిదా పడటంతో తీవ్ర నిరాశ.. ప్రొడ్యూసర్స్‌పై మండిపడుతూ పోస్టులు
బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడటం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. అంతేకాదు ఈ సినిమాను చూడటానికి వందల కిలోమీటర్లు ప్రయాణించిన అభిమానులు కూడా ఉన్నారు. వాళ్లంతా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'అఖండ 2' విడుదలకు బ్రేక్ పడటం అభిమానులను షాక్‌కు గురిచేసింది. డిసెంబర్ 5న (శుక్రవారం) గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ప్రీమియర్స్ రద్దయ్యాయని, సినిమా వాయిదా పడిందని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ గురువారం (డిసెంబర్ 14) అర్ధరాత్రి ప్రకటించింది. చివరి నిమిషంలో వచ్చిన ఈ ప్రకటనతో అప్పటికే థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

475 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినా..
అఖండ 2 సినిమా వాయిదా పడటంతో దేశవిదేశాల్లోని బాలయ్య అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అభిమానులు సినిమా చూడటానికి దూర ప్రాంతాల నుంచి వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వద్ద జరిగిన ఒక ఘటన అభిమానుల ఆవేదనకు అద్దం పడుతోంది. "పాపం మా బ్రదర్ మనోజ్, అతని 10 మంది స్నేహితులు కేవలం ప్రసాద్స్ పీసీఎక్స్ (PCX) స్క్రీన్‌పై 'అఖండ 2' చూడటానికి 475 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. ఉదయం 5 గంటలకు బస్సు ఎక్కి వచ్చినా వారికి నిరాశే ఎదురైంది" అని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అమెరికాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా థియేటర్లకు వెళ్లిన అభిమానులు.. సినిమా వాయిదా పడిందని తెలిసి తీవ్ర అసహనానికి గురయ్యారు. "కంటెంట్ ఆలస్యం కావడం, చివరి నిమిషంలో వాయిదా వేయడం యూఎస్ ఫ్యాన్స్‌ను దెబ్బతీస్తోంది" అని వారు వాపోయారు.
మరోవైపు జర్మనీలో రూ. 2 లక్షలు పెట్టి 'అఖండ 2' మొదటి టికెట్ కొన్న అభిమాని పరిస్థితి ఏంటంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది బాలయ్య అభిమానులందరికీ నిజంగా గుండె పగిలే వార్త అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సినిమా వాయిదా పడిందని చెప్పిన తర్వాత.. తదుపరి విడుదల తేదీపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై అభిమానులు నిర్మాతల తీరును తప్పుబడుతున్నారు. "ఇండియాలో అప్పుడే తెల్లవారుజామున 3 గంటలు అవుతోంది. 5 గంటలైనా కనీసం ఒక్క అప్డేట్ ఇవ్వరా? సిగ్గుచేటు" అని ఒక అభిమాని ‘ఎక్స్’లో మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా అప్డేట్ లేకపోవడంతో.. "నిర్విరామంగా పనిచేస్తున్నామని చెప్పారు.. కానీ 11 గంటలైనా ఒక్క ముక్క చెప్పలేదు" అని మరొకరు అసహనం వ్యక్తం చేశారు.
నిర్మాణ సంస్థ తమ చివరి ప్రకటనలో.. "అనివార్య కారణాల వల్ల 'అఖండ 2' షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని బరువైన హృదయంతో తెలియజేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. త్వరలోనే పాజిటివ్ అప్డేట్ ఇస్తాం" అని పేర్కొంది.
అసలు సినిమా ఎందుకు ఆగింది?
గురువారం నాడు ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తమకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో మద్రాస్ హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ (నిలుపుదల ఉత్తర్వులు) తెచ్చుకున్నట్లు వెల్లడించింది.
ఎరోస్ సంస్థకు 14 రీల్స్ దాదాపు రూ. 28 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. ఈ బకాయిలు చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను విడుదల చేయడం, పంపిణీ చేయడం లేదా వాణిజ్యపరంగా వాడుకోవడం కుదరదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్టు కేసు కారణంగానే చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


